చెన్నై: ప్రధానమంత్రి నరేంద్రమోదీ తమిళనాడులోని తీర పట్టణం కన్యాకుమారి చేరుకున్నారు. అక్కడి ప్రసిద్ధ వివేకానంద రాక్ మెమోరియల్‌లో 45 గంటలపాటు సుదీర్ఘ ధ్యానం చేయనున్నారు. ముందుగా భగవతి అమ్మన్ ఆలయానికి వెళ్లి ప్రార్థనలు చేశారు మోదీ. ధోతీ తెల్లటి శాలువ ధరించిన ప్రధాని.. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు, మోదీకి పూజారులు ప్రత్యేక హారతి అందించారు. అలాగే ఓ శాలువ, అమ్మవారి ఫోటో, ప్రసాదాన్ని ప్రధానికి అందించారు.
నేటి సాయంత్రంతో లోక్‌సభ ఎన్నికల ప్రచారం పూర్తిగా ముసిగింది. ర్యాలీలు పర్యటనలు, బహిరంగ సభలతో బిజీ బిజీగా గడిపిన ప్రధాని మోదీ కాస్త విశ్రాంతి తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే రెండు రోజులపాటు పూర్తిగా ధ్యానంలో మునిగిపోనున్నారు. మే 30 సాయంత్రం నుంచి జూన్ 1 సాయంత్రం వరకు దాదాపు 45 గంటల పాటు ఆయన ధ్యానం చేయనున్నారు. కాగా ఎన్నికల ప్రచారం ముగిశాక ప్రధాని మోదీ ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లడం ఇదేం తొలిసారి కాదు. 2019లో కేదార్‌నాథ్‌ను, 2014లో శివాజీ ప్రతాప్‌గఢ్‌ను సందర్శించారు.
ప్రత్యేకత ఇదే..
అయితే ఈ వివేకానంద రాక్ మెమొరియల్‌కు ఎంతో ప్రత్యేకత ఉంది. 132 ఏళ్ల క్రితం 1892 లో స్వామి వివేకానంద.. ఈ వివేకానంద రాక్ మెమొరియల్ ఉన్న ప్రాంతంలో ధ్యానం చేశారు. అందుకే ఆయనకు నివాళులు అర్పించేందుకు గుర్తుగా కన్యాకుమారిలో సముద్రంలో ఈ వివేకానంద రాక్ మెమొరియల్‌ను నిర్మించారు.
ఇక ప్రధాని నరేంద్ర మోదీ 2 రోజుల పాటు కన్యాకుమారిలో ఉండనుండటంతో ఆ ప్రాంతంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. దాదాపు 2 వేల మంది పోలీసులను మోహరించారు. గురువారం సాయంత్రం నుంచి జూన్ 1 వ తేదీ వరకు కన్యాకుమారిలో మోదీ ఉండనున్నారు. ఈ క్రమంలోనే భారత తీర రక్షక దళం, భారత నావికాదళం గట్టి నిఘా ఉంచాలని కోరింది.
ఇదిలా ఉండగా ఏప్రిల్ 19న ప్రారంభమైన లోక్‌సభ ఎన్నికలు ఏడు దశల్లో జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఆరు విడతల్లో ఎన్నికలు పూర్తి కాగా.. జూన్ ఒకటిన చివరి దశ ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment