కోర్టుకు హాజరుకాని సోనియా, రాహుల్
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ పాటియాలా కోర్టుకు గైర్హాజరయ్యారు. దీంతో కోర్టు మరోసారి వారికి అవకాశం ఇచ్చింది. ఈ నెల 19న కోర్టుకు తప్పనిసరిగా రావాలని ఆదేశించింది. కాగా, ఈ కేసులో తమ నేతలు కోర్టుకు హాజరుకావాల్సిన అవసరం లేదని, తాము సుప్రీంకోర్టుకు వెళతామని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం మంగళవారం బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి, సోనియా, రాహుల్ తరుపున కాంగ్రెస్ పార్టీ నేత, న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ మాత్రమే పాటియాల కోర్టుకు హాజరయ్యారు.
మరికొందరు వ్యక్తులను సుబ్రహ్మణ్యస్వామి తన వెంట తీసుకొని కోర్టుకు వచ్చారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక నిధుల దుర్వినియోగం కేసులో కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ కి సమన్లు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఈ సమన్లు రద్దు చేయాలని వారు ఢిల్లీ కోర్టులో పిటిషన్ వేసినా కోర్టు తోసిపుచ్చింది. విచారణకు వ్యక్తిగత హాజరునుంచి మినహాయింపు ఇవ్వాలన్న అభ్యర్థనను కొట్టివేసింది. కోర్టుకు కచ్చితంగా హాజరుకావాల్సిందేనని కోర్టు ఆదేశించినా వారు హాజరుకాకపోవడం గమనార్హం.
కోర్టు ఆదేశాలు పట్టించుకోకుండా మంగళవారం రాహుల్ గాంధీ తమిళనాడులోని వరద బాధితులను పరామర్శించే కార్యక్రమం పెట్టుకున్నారు. మరోపక్క, ఈ కేసుకు సంబంధించి సోనియాగాంధీని జర్నలిస్టులు పలుమార్లు ప్రశ్నించడంతో తాను ఈ విషయంలో ఏ విధంగాను స్పందిచబోనని 'మీరయితే ఎలాంటి న్యాయం చెప్తారో చెప్పండి' అంటూ ఆమె ఎదురు ప్రశ్నించారు. ఈ కేసు వెనుక రాజకీయ పరమైన దురుద్దేశం ఉందన్నారు చెప్తున్నారు. నేషనల్ హెరాల్డ్ ఆంగ్ల దినపత్రిక నష్టాలతో 2008లో మూతపడింది. పత్రికకు చెందిన రూ.2,000 కోట్లను దుర్వినియోగం చేశారంటూ సోనియా, రాహుల్‌లపై బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి కేసు వేసిన విషయం తెలిసిందే.