సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్యలోని రామమందిర్-బాబ్రీ మసీదు స్ధలంలో పూజలు నిర్వహించే ప్రాథమిక హక్కు తనకుందని అంటూ బీజేపీ నేత, రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సోమవారం సుప్రీం కోర్టులో అప్పీల్ చేశారు. అయోధ్య కేసు విచారణ ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ముందుకు వచ్చే సమయంలో మంగళవారం కోర్టుకు హాజరైతే ఈ అంశంపై ఓ నిర్ణయం తీసుకుంటామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్, జస్టిస్ సంజీవ్ ఖన్నా సుబ్రహ్మణ్య స్వామిని కోరారు.
అయితే తన అప్పీల్‌ను సత్వరమే విచారించాలని, దీన్ని ప్రత్యేకంగా విచారణ చేపట్టాలని స్వామి సర్వోన్నత న్యాయస్ధానానికి విజ్ఞప్తి చేశారు.అయోధ్య కేసును విచారించే ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం రాజ్యాంగ ధర్మాసనానికి నేతృత్వం వహించే జస్టిస్ గగోయ్ స్వామి వినతిని తోసిపుచ్చుతూ మంగళవారం జరిగే అయోథ్య కేసుపై విచారణ సమయంలో న్యాయస్ధానంలో ఉండాలని ఆయనను కోరారు.
కాగా అయోధ్య కేసును విచారించే సుప్రీం బెంచ్‌లో ప్రధాన న్యాయమూర్తి గగోయ్‌తో పాటు జస్టిస్ బోబ్డే, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్‌ఏ నజీర్‌లున్నారు.అయోధ్యలోని 2.77 ఎకరాల వివాదాస్పదభూమిని సున్నీ వక్ఫ్‌బోర్డు, నిర్మోహి అఖాడా, రామ్‌లల్లా మధ్య సమానంగా పంపిణీ చేయాలని 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన 14 పిటిషన్లను సీజేఐ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం విచారించనుంది.
Comments
Please login to add a commentAdd a comment