![మూడు ఆలయాలివ్వండి చాలు! - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/81452455469_625x300.jpg.webp?itok=HIzxcsy-)
మూడు ఆలయాలివ్వండి చాలు!
39,997 మసీదులు మీరే ఉంచేసుకోండి
♦ ముస్లింలకు బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి ఆఫర్
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి ఆదివారం ట్విటర్‌లో వివాదాస్పద వ్యాఖ్య చేశారు. ‘హిందువులమైన మేం ముస్లింలకు ఒక లార్డ్ కృష్ణ ప్యాకేజ్ ఆఫర్ ఇస్తున్నాం. మాకు మూడు(అమోధ్య, మధుర, కాశీ) ఆలయాలివ్వండి. మిగతా 39,997 మసీదులను మీరే ఉంచేసుకోండి. ముస్లిం నేతలు దుర్యోధనులు కాబోరని ఆశిస్తున్నా’అని ట్వీట్ చేశారు. కురుక్షేత్ర యుద్ధాన్ని నివారించేందుకు, పాండవులు, కౌరవుల మధ్య సయోధ్యకు.. పాండవులకు ఐదు గ్రామాలను ఇస్తే చాలన్న కృష్ణుడి రాయబారాన్ని గుర్తుకు తెచ్చే లాఆ ట్వీట్ చేశారు. సూదిమొన మోపేంత స్థలం కూడా ఇవ్వబోమంటూ కృష్ణుడి రాయబారాన్ని దుర్యోధనాదులు తోసిపుచ్చడం తెలిసిందే.
కాగా, అయోధ్యలో మందిర నిర్మాణం ఈ ఏడాది చివరలోగా ప్రారంభమవుతుందని స్వామి చెప్పారు. సుప్రీంకోర్టు తుది తీరు్పు మందిర నిర్మాణానికి అనుకూలంగా వస్తుంద ని ఆశాభావం వ్యక్తంచేశారు. అయోధ్యలో, కావాలంటే ముస్లింలు సరయూ నదీతీరంలో మరో మసీదును కట్టుకోవచ్చని, కానీ, ఆ మసీదుకు బాబర్ పేరు పెట్టకూడదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ వర్సిటీలో అరుంధతి వశిష్ట అనుసంధాన్ పీఠ్ ఆధ్వర్యంలో జరిగిన ‘రామ జన్మభూమి ఆలయం.. ప్రస్తుత పరిస్థితులు’ అంశంపై సదస్సులో ఆదివారం స్వామి ప్రసంగించారు.
రామమందిరం కేసు గెలిచాక మధురలో కృష్ణాలయం, వారణాసిలో కాశీ విశ్వనాథ్ ఆలయాల కేసులనూ సునాయాసంగా గెలుస్తామన్నారు. అయోధ్య కేసే క్లిష్టమైనదని, మిగతా కేసుల్లో స్పష్టమైన సాక్ష్యాధారాలున్నాయన్నారు. కాగా, రామమందిర నిర్మాణానికి అనుకూలంగా సాక్ష్యాధారాలు బలంగా ఉన్నాయంటూ అదనపు సొలిసిటర్ జనరల్ అశోక్ మెహతాఅన్నారు. సదస్సు నిర్వహణకు ఢిల్లీ వర్సిటీలోని ఏఐఎస్‌ఏ, డీఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, ఎన్‌ఎస్‌యూఐ తదితర విద్యార్థి సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
‘ఏకాభిప్రాయం కుదిరాకే రామమందిరం’
అన్ని మతాల వారినీ సంప్రదించి అభిప్రాయాలు తీసుకున్నాకే అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరుగుతుందని ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్థ ‘ముస్లిం రాష్ట్రీయ మంచ్’ పేర్కొంది.