ప్రతికాత్మక చిత్రం
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో జన్మించిన ఇద్దరు మహిళలు జమ్మూ కశ్మీర్ పంచాయతీ ఎన్నికల్లో చరిత్ర సృష్టించారు. మాజీ మిలిటెంట్లను పెళ్లి చేసుకుని కశ్మీర్‌కు వచ్చిన ఈ మహిళలు ఉత్తర కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. మిలిటెంట్ల హెచ్చరికల మధ్య ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో చాలా తక్కువ శాతం ఓటింగ్ నమోదైంది. ఇలాంటి ఎన్నికల్లో పీవోకే నుంచి వచ్చిన దిల్షాదా బేగం, ఆరిఫాబేగం గెలుపొందడం అసాధారణమైనదిగా అక్కడి వారు పరిగణిస్తున్నారు.
రావల్‌పిండి నుంచి కశ్మీర్‌కు...
పీవోకే రాజధాని ముజఫరాబాద్‌లో పుట్టిన దిల్షాదా, పాకిస్తాన్ పంజాబ్ రావల్‌పిండిలో పెరిగారు. 1990లలో ఆయుధాల ప్రయోగంలో శిక్షణ కోసం భట్ కశ్మీర్ సరిహద్దులు దాటి పాకిస్తాన్‌లోకి ప్రవేశించారు. ఏడేళ్ల పాటు రావల్‌పిండిలోనే స్థిరపడి కొత్త జీవితాన్ని ప్రారంభించినా మళ్లీ కశ్మీర్‌కు వెళ్లాలని గట్టిగా కోరుకున్నారు. 2004 జూన్‌లో మహ్మద్ యూసుఫ్ భట్‌ను దిల్షాదా పెళ్లాడారు. 2012లో ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని కశ్మీర్ ప్రభుత్వం మిలిటెంట్ల పునరావాస పథకాన్ని ప్రకటించడంతో భట్ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. 1990లలో సరిహద్దులు దాటిన మిలిటెంట్లు కశ్మీర్‌లోని తమ సొంత ఇళ్లకు చేరుకున్నారు. 2012 జూన్‌లో ముగ్గురు పిల్లలతో కలిసి దిల్షాదా మొదటిసారిగా భర్త భట్ స్వగ్రామం ప్రింగ్రూకు వచ్చాక మొదట్లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అక్కడి పరిస్థితులకు అలవాటుపడ్డాక కశ్మీర్‌కు వచ్చినందుకు సంతోషంగా ఉన్నట్టుగా ఆమె వెల్లడించారు. ఈ ఊర్లోనే భట్ చిన్న కిరాణాషాపును నిర్వహిస్తున్నాడు. ఇటీవల పంచాయతీ ఎన్నికలు ప్రకటించడంతో భారత పౌరురాలుగా (కశ్మీరీలను పెళ్లాడిన వారికి భారత పౌరసత్వం లభిస్తుంది) మారిన దిల్షాదాను పోటీచేయాల్సిందిగా ఇరుగుపొరుగు ఒత్తిడి తెచ్చారు. ప్రస్తుతం ఐదుగురు పిల్లలకు తల్లి అయిన ఆమె పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఆరిఫాదీ అదే బాట..
పీవోకే రాజధాని ముజఫరాబాద్‌కు చెందిన 35 ఏళ్ల ఆరిఫాది కూడా దాదాపుగా దిల్షాదా లాంటి కథే. కశ్మీర్ సరిహద్దులు దాటి పాకిస్తాన్‌కు వెళ్లిన గులాం మహ్మద్ మీర్‌ను ఆరిఫా పెళ్లాడారు. 2010లో కశ్మీర్‌కు తిరిగొచ్చిన ఈ జంట మీర్ సొంత గ్రామం ఖుమ్రియల్ (కుప్వారా జిల్లా)లో స్థిరపడ్డారు. ప్రస్తుతం మీర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు, పంచాయతీ ఎన్నికల్లో ఆరిఫా బీజేపీ టికెట్‌పై పంచ్ స్థానానికి, ఖుమ్రియల్–బీలోని సర్పంచ్‌వార్డుకు పోటీచేశారు. ఆమెపై పోటీచేసేందుకు ఎవరూ నామినేషన్ వేయకపోవడంతో రెండుస్థానాలకూ ఆరిఫా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా అధికారులు ప్రకటించారు. ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో కుప్వారా జిల్లాలోని 40 సర్పంచ్ స్థానాలు, 669 పంచ్ వార్డులకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment