చిరుతను చంపుతారా లేదా?
జమ్ము: 'మా ప్రాణాల పాలిట యమదూతలా మారిన చిరుత పులిని చంపుతారా లేదా?' ఏకంగా జిల్లా కలెక్టర్ బంగళానే ముట్టడించారు గ్రామస్తులు. శనివారం జమ్ముకశ్మీర్ లోని దోడా జిల్లా కేంద్రం ఈ ఆందోళనకు కేంద్రమైంది. జిల్లాలోని భగ్వాలో ఓ మహిళపై చిరుత పులి దాడిచేసింది. తీవ్ర గాయాలపాలైన ఆమెను స్థానికులు జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయింది.
గడిచిన పదిహేను రోజుల్లో చిరుత పులి తమ గ్రామంపై దాడిచేయడం మూడోసారని, వెంటనే దాన్ని చంపేయాలని డిమాండ్ చేస్తూ మహిళ మృతదేహంతో కలెక్టర్ బంగళాను ముట్టడించారు గ్రామస్తులు. సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని కలెక్టర్ గట్టి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.