
సునంద హత్యకేసులో తెరపైకి సునీల్ సాహెబ్!
న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ భార్య సునంద పుష్కర్ మృతి కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో 'సునీల్' అనే పేరు తెరపైకి వచ్చింది. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణలో పనిమనిషి నారాయణ్ పలు కొత్త విషయాలను వెల్లడించినట్లు సమాచారం. శశిథరూర్ ప్రవర్తనపై సునంద అసంతృప్తిగా ఉందని, వీరిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో చాలాసార్లు ఘర్షణ జరిగినట్లు పనిమనిషి చెప్పినట్లు తెలుస్తోంది. ఆమె తన సమస్యలను స్నేహితులతో చెప్పేదని నారాయణ్ సిట్ అధికారులకు వివరించాడు.
కాగా సునంద చనిపోవటానికి రెండు రోజుల ముందు సునీల్ అనే వ్యక్తి కలిసినట్లు తెలుస్తోంది. హోటల్ లీలా ప్యాలెస్లో సునంద గదిలో 'సునీల్ సాహెబ్' ఉన్నట్లు నారాయణ్ ...సిట్ విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది. అయితే సునీల్ సాహెబ్ ఎవరు, ఎక్కడ ఉంటారనేదానిపై అతను సమాధానం చెప్పలేకపోయినట్లు సమాచారం. దాంతో సునీల్ను విచారిస్తే కానీ అసలు విషయం వెలుగులోకి వస్తుందని సిట్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో సునీల్ను కూడా సిట్ విచారించనుంది. అయితే అతని కోసం గాలింపును ముమ్మరం చేసింది. సునంద ట్విట్టర్ అకౌంట్తో పాలు ఆమె ఆన్లైన్ వ్యవహారాలను సునీల్ సాహెబ్ చూసేవాడని తెలుస్తోంది.
మరోవైపు సిట్ తన విచారణలో భాగంగా సునంద మరణానికి 48 గంటల ముందు ఆమెను ఎవరెవరు కలిశారు? ఆమె శరీరంపై గాయాలు, ఇతర అంశాలకు సంబంధించిన వివరాలను సేకరించింది. ఆమె అనారోగ్యంతో బాధపడుతూ ఔషధాలు తీసుకునేవారా? హోటల్ గదిలో లభించిన రెండు ఆల్ప్రాక్స్ మాత్రలు, శరీరంపై సూది గుచ్చిన గాయం గురించి విచారణ చేశారు. ఈ-మెయిళ్లు, ట్వీటర్, ఇతర సోషల్ మీడియా సైట్ల ద్వారా ఎవరెవరితో టచ్‌లో ఉండేవారన్నదీ అడిగారు.
సునంద కేసులో తన పనిమనిషిని హింసించారంటూ థరూర్ ఫిర్యాదు చేసిన మరునాడే నారాయణను సిట్ విచారించడం గమనార్హం. ఇప్పటికే అతనిని పోలీసులు రెండుసార్లు విచారించారు. మరోవైపు థరూర్ వ్యక్తిగత సిబ్బందితో పాటు సునంద మృతిచెందిన ఫైవ్‌స్టార్ హోటల్ ఉద్యోగులనూ సిట్ ప్రశ్నించనుంది.