సూపర్‌సోనిక్‌ క్షిపణి పరీక్ష విజయవంతం | Supersonic missile test successful | Sakshi
Sakshi News home page

సూపర్‌సోనిక్‌ క్షిపణి పరీక్ష విజయవంతం

Published Thu, Mar 2 2017 1:06 AM | Last Updated on Tue, Sep 5 2017 4:56 AM

సూపర్‌సోనిక్‌ క్షిపణి పరీక్ష విజయవంతం

సూపర్‌సోనిక్‌ క్షిపణి పరీక్ష విజయవంతం

బాలసోర్‌: తక్కువ ఎత్తులో మన దేశంపైకి వచ్చే ఏ బాలిస్టిక్‌ శత్రు క్షిపణిని అయినా నాశనం చేయగల సూపర్‌ సోనిక్‌ ఇంటర్‌సెప్టార్‌ క్షిపణిని భారత్‌ బుధవారం విజయవంతంగా పరీక్షించింది. దీనిని దేశీయంగా తయారు చేశారు. నెల గడవక ముందే ఈ క్షిపణిని బుధవారం రెండోసారి పరీక్షించారు. భారత్‌కు వివిధ స్థాయుల్లో క్షిపణి రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడంలో భాగంగా దీనిని అభివృద్ధి చేశారు. పృథ్విని శత్రు క్షిపణిలా మార్చి సూపర్‌సోనిక్‌ ఇంటర్‌సెప్టార్‌ క్షిపణికి లక్ష్యంగా నిర్దేశించారు. ఒడిశా చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ (ఐటీఆర్‌)లోని మూడవ క్షిపణి ప్రయోగ వేదిక నుంచి పృథ్విని ఉదయం 10.10 గంటలకు ప్రయోగించారు.

బంగాళాఖాతంలోని అబ్దుల్‌ కలాం దీవిలో ఏఏడీ (అడ్వాన్స్‌డ్‌ ఎయిర్‌ డిఫెన్స్‌) సూపర్‌ సోనిక్‌ క్షిపణిని మోహరించారు. పృథ్వి గురించి రాడార్ల ద్వారా సంకేతాలు అందుకున్న ఏఏడీ, గాలిలోనే పృథ్విని అడ్డుకుంది. ‘ప్రయోగం బాగా జరిగింది. పృథ్విని ఏఏడీ నేరుగా ఢీకొట్టింది’అని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. 7.5 మీటర్ల పొడవు ఉండే ఈ క్షిపణిలో దిక్సూచి వ్యవస్థ, అధునాతన కంప్యూటర్, ఒక ఎలక్ట్రో–మెకానికల్‌ యాక్టివేటర్‌లు కూడా ఉంటాయని అధికారి పేర్కొన్నారు. ఫిబ్రవరి 11న కూడా ఈ క్షిపణిని ఎక్కువ ఎత్తులో విజయవంతంగా పరీక్షించారు. అంతకుముందు తక్కువ ఎత్తులో 2016 మే 15న జరిపిన పరీక్ష కూడా విజయవంతం అయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement