
సాక్షి, న్యూఢిల్లీ : భీమా కోరేగాం కేసుపై సుప్రీం కోర్టులో ఆసక్తికర వాదనలు సాగాయి. రోనా విల్సన్ ల్యాప్‌టాప్ నుంచి రికవర్ చేసిన లేఖలను అదనపు సొలిసిటర్ జనరల్ ధర్మాసనానికి నివేదించారు. హార్డ్ డిస్క్ నుంచి స్వాధీనం చేసుకున్న పత్రాలు ఫోర్జ్ చేసినవి కావని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ రిపోర్ట్ ఇచ్చిందని కోర్టుకు తెలిపారు. ఈ లేఖలతో మొత్తం ఐదుగురు అరెస్టయినవారికి ఎలాంటి సంబంధం ఉందని ధర్మాసనం ప్రశ్నించింది. నేర పరిశోధనలో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాల జోక్యం ఉండరాదని అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు.
అపరిచితుల ఆదేశాలతో దాఖలైన వ్యాజ్యం నిలబడదని అదనపు సొలిసిటర్ జనరల్ వాదించారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం నిష్పాక్షికంగా ఈ కేసు దర్యాప్తు జరిగిందని స్పష్టం చేశారు. ఎఫ్.ఐ.ఆర్‌లో ఫిర్యాదుదారుడి తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే దర్యాప్తులో సంఘ విద్రోహ చర్యలు లేదా చట్ట వ్యతిరేక చర్యలున్నట్టు తేలితే, ఆ దర్యాప్తు కొనసాగించాల్సిందేనన్నారు. పిటిషనర్ల అభ్యర్థన మేరకు సిట్ ఏర్పాటు చేయడమంటే మన దర్యాప్తు సంస్థలైన ఎన్ఐఏ, సీబీఐ మీద నమ్మకం లేదని అంగీకరించినట్టే అవుతుందన్నారు.
ఇక పిటిషనర్ల తరఫు వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి ఈ కేసులో దర్యాప్తు తీరును ఆక్షేపించారు. ఈ మొత్తం దర్యాప్తు ఉద్దేశమే ఒక భయానక వాతావరణం సృష్టించడమే. అందుకే మావోయిస్టు లేఖల కథలు అల్లుతున్నారని ఆరోపించారు. అదనపు సొలిసిటర్ జనరల్ సమర్పించిన లేఖల్ని ప్రెస్ కాన్ఫరెన్సులో పోలీసులు అందరికీ చూపించి, సర్క్యులేట్ చేశారని, మహారాష్ట్ర పోలీసు ఉన్నతాధికారి ఈ పీసీలో ఉన్నారని సింఘ్వీ కోర్టుకు తెలిపారు.
ఈ లేఖలన్నీ మీడియాకు ఎలా చేరాయని అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ధర్మాసనం ప్రశ్నించింది. కేసు డైరీని తమకు అప్పగించాలని అదనపు సొలిసిటర్ జనరల్‌ను సుప్రీం ఆదేశిస్తూ వాదోపవాదాల అనంతరం సిట్ దర్యాప్తు అవసరమా లేదా అన్న విషయంపై తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం రిజర్వులో ఉంచింది.
Comments
Please login to add a commentAdd a comment