న్యూఢిల్లీ: శబరిమల ఆలయంలోకి అన్ని వయ సుల మహిళలను అనుమతించాలన్న తీర్పుపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్లపై వచ్చే జనవరి 22న ఓపెన్ కోర్టులో విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. సెప్టెంబర్ 23వ తేదీ నాటి తీర్పును సమీక్షించాలంటూ దాఖలైన 48 పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, ఆర్‌ఎఫ్ నారిమన్, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్ర చూడ్, జస్టిస్ ఇందూ మల్హోత్రాల ధర్మాసనం మంగళవారం సుప్రీంకోర్టు చాంబర్‌లో విచారణ చేపట్టింది. న్యాయవాదులెవరూ లేకుండా కేవలం న్యాయమూర్తులు మాత్రమే పిటిషన్లను పరిశీలించారు. అనంతరం వెలువరించిన ఆదేశాల్లో... ‘ఈ అంశంపై పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, దాఖలైన రివ్యూ పిటిషన్లు అన్నిటిపైనా జనవరి 22న తగు ధర్మాసనం విచారణ చేపడుతుంది. ‘ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్, ఇతరులు వర్సెస్ కేరళ ప్రభుత్వం, ఇతరులు’ కేసులో సెప్టెంబర్ 28న వెలువరించిన తీర్పుపై స్టే ఉండబోదని స్పష్టం చేస్తున్నాం’ అని ధర్మాసనం పేర్కొంది. అంతకుముందు.. ఇదే అంశంలో సుప్రీం తీర్పును సవాల్ చేస్తూ జి.విజయ్‌కుమార్, ఎస్.జయ రాజ్‌కుమార్, శైలజా విజయన్ అనే వారు దాఖలు చేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాస నం..‘సెప్టెంబర్ 23నాటి తీర్పును సమీక్షించా లని నిర్ణయించినట్లయితే, తాజా పిటిషన్లను రివ్యూ పిటిషన్లతో పాటు కలిపి విచారిస్తాం. ఒకవేళ రివ్యూ పిటిషన్లను కోర్టు తిరస్కరిస్తే, కొత్త పిటిషన్లపై ప్రాధాన్యతా క్రమంలో వేరుగా విచారణ చేపడతాం’ అని పేర్కొంది.
రిట్ పిటిషన్లలో ఏముంది?
శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అడ్డుకోవడం లింగ వివక్షేనంటూ సెప్టెంబర్ 28న అప్పటి సీజేఐ జస్టిస్ దీపక్‌మిశ్రా ఆధ్వర్యంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై అయ్యప్ప భక్తుల జాతీయ సంఘం (నాడా), నాయిర్ సేవా సంఘం (ఎన్‌ఎస్‌ఎస్) తదితర సంఘాలు, వ్యక్తులు రివ్యూ పిటిషన్లు వేశాయి. ‘రుతు స్రావం మహిళలను ఆలయం లోకి అనుమతించాలన్న తీర్పు విప్లవాత్మకం, ఈ తీర్పుతో రుతుస్రావం మలినం, అశుద్ధం అనే దురభిప్రాయం తొలగి పోతుందనే భావన తప్పు. వార్తల్లోకి రావాలనే తలంపుతో ఉన్న దొంగభక్తులు మాత్రమే సుప్రీం తీర్పును స్వాగతించారు. వాస్తవాల ఆధారంగా ఈ కేసును పరిశీలించినట్లయితే ఈ తీర్పు అహేతు కం, అసమర్థనీయం’ అని నాడా పేర్కొంది. ‘అయ్యప్ప స్వామి ‘నైష్టిక బ్రహ్మచారి’ అయి నందున 10 ఏళ్ల లోపు 50 ఏళ్లు పైబడిన మహిళలు మాత్రమే పూజలు చేయడానికి అరు ్హలు. అంతేకానీ, మహిళలు అయ్యప్పను పూజిం చరాదన్న నియమమేమీ లేదు. చట్టంలో లోపా లతో ఈ కేసు విచారణ 40 ఏళ్లు పట్టింది. అయితే, ఆలయంలోకి మహిళలకు అవకాశం కల్పించడంఆలస్యమైందంటూ ఇలాంటి తీర్పు ఇవ్వడం సరికాదు’ అని ఎన్‌ఎస్‌ఎస్ పేర్కొంది.
శబరిమల తీర్పుపై స్టే ఇవ్వం
Published Wed, Nov 14 2018 12:56 AM | Last Updated on Wed, Nov 14 2018 9:01 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment