సాక్షి, న్యూఢిల్లీ : నోయిడా, గ్రేటర్ నోయిడాలలో అపార్ట్‌మెంట్లను నిర్మిస్తున్న ప్రముఖ భవన నిర్మాణ సంస్థ ‘ఆమ్రపాలి గ్రూప్’కు వ్యతిరేకంగా మంగళవారం సుప్రీం కోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించిన విషయం తెల్సిందే. తామూ ఓ ఇంటి వాళ్లమవుదామనే ఓ జీవితకాల స్వప్న సాఫల్యం కోసం కష్టపడి సంపాదించిన సొమ్మే కాకుండా, బ్యాంకుల నుంచి అరువు తెచ్చికొని మరీ సొమ్ము చెల్లిస్తే నిర్దాక్షిణ్యంగా దాన్ని మరో వ్యాపారానికి తరలించి, అపార్ట్‌మెంట్ల నిర్మాణాన్ని ఆలస్యం చేయడం దారుణమంటూ ఆ రియల్ ఎస్టేట్ గ్రూప్‌పై సుప్రీం కోర్టు మండి పడడం, ఆ గ్రూప్ రిజిస్ట్రేషన్నే రద్దు చేయడం మనకు ఎంతో సబబుగాగా అనిపిస్తుంది.
సుప్రీం కోర్టు అంతటితో అగకుండా ఆమ్రపాలి చేపట్టిన అపార్ట్‌మెంట్ల నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ‘నేషనల్ బిల్డింగ్స్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్’కు అప్పగించడం, అదనపు నిధులు అవసరమైతే సేకరించేందుకు వీలుగా అపార్ట్‌మెంట్ల భూమి హక్కులను ఓ కోర్టు రిసీవర్‌కు అప్పగించడం మరీ అద్భుతమని కొంత మంది సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. భవన నిర్మాణ రియల్టర్లు కస్టమర్ల నుంచి ముందుగానే డబ్బులు వసూలు చేయడం, భవన నిర్మాణాలను పూర్తి చేయకుండానే మధ్యలోనే వదిలేయడం లాంటి సమస్యలు ఒక్క నోయిడాకు, ఒక్క ఆమ్రపాలి గ్రూపునకే పరిమితం కాలేదు.
నోయిడా, గ్రేటర్ నోయిడాలో ఆగిపోయి లేదా ఆలస్యమవుతున్న నిర్మాణాలు 1.50 లక్షలని ఓ అంచనా కాగా, దేశవ్యాప్తంగా అలా ఏడున్నర లక్షల నిర్మాణాలు ఉన్నాయి ? ఇలాంటి సమయంలో ఒక్క నోయిడాకే పరిమితమై సుప్రీం కోర్టు తీర్పు చెప్పడం అన్నది చట్టంలోని ‘అందరికి సమాన న్యాయం’ సూత్రాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. ఆమ్రపాలి గ్రూప్ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయడం వరకు సుప్రీం కోర్టు తీర్పు సబబే! ఆ నిర్మాణాలను పూర్తి చేసేందుకు ప్రభుత్వ సంస్థను తానే ఎంపిక చేయడం, డబ్బుల సేకరణకు భూమిపై కోర్టు రిసీవర్‌కు హక్కులు కల్పించడం కచ్చితంగా ప్రభుత్వ కార్యనిర్వహణలో జోక్యం చేసుకోవడమే అవుతుందన్న వాదన నిపుణుల నుంచి బలంగా వినిపిస్తోంది.
ఇలా సుప్రీం కోర్టు ప్రభుత్వ కార్యనిర్వహణలో జోక్యం చేసుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో అస్సాంలో పౌరసత్వం చట్టాన్ని ఎలా అమలు చేయాలో, వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఎలాంటి బస్సులు కొనాలో నిర్దేశించడమే కాకుండా భారత క్రికెట్ బోర్డు కార్యకలాపాలను చూసుకునేందుకు నలుగురు సభ్యుల ప్యానెల్‌ను కూడా నియమించింది. కార్య నిర్వహణా రంగం ప్రభుత్వానికి సంబంధించినది. అది నిస్తేజమైతే చికిత్సకు ఆదేశాలు జారీ చేయవచ్చు. కింది స్థాయి నుంచి సుప్రీం కోర్టు వరకు కొన్ని కోట్ల కేసులు అపరిష్కృతంగా మూలుగుతున్నాయి. ఆ విషయంలో సుప్రీం కోర్టు కార్యనిర్వహణ రంగంలోకి దూసుకుపోయి ఉంటే లేదా క్రియాశీలకంగా వ్యవహరించి ఉంటే ఈపాటికి అన్ని కేసులు పరిష్కారమయ్యేవన్నది కూడా నిపుణుల వాదన.
Comments
Please login to add a commentAdd a comment