మాజీ కేంద్ర మంత్రి దయానిధి మారన్ (ఫైల్‌ఫోటో)
సాక్షి, చెన్నై : అక్రమ టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ కేసులో కేంద్ర టెలికాం మాజీ మంత్రి దయానిధి మారన్, ఆయన సోదరుడు కళానిధి మారన్‌లు విచారణను ఎదుర్కోవాలని సర్వోన్నత న్యాయస్ధానం స్పష్టం చేసింది. ఈ కేసులో మారన్ సోదరులను సీబీఐ తప్పించడాన్ని తోసిపుచ్చుతూ హైకోర్టు ఉత్తర్వులను సుప్రీం కోర్టు సమర్ధించింది. మీ సోదరుల టీవీ ఛానెల్‌కు మీరు సహకరించారన్న ఆరోపణలపై విచారణను ఎదుర్కోవాల్సిందేనని కేసు నుంచి తప్పించాలన్న దయానిధి మారన్ అప్పీల్‌ను సుప్రీం తిరస్కరించింది.
సన్ గ్రూప్ సారధులైన మారన్ సోదరులపై 12 వారాల్లోగా అభియోగాలు నమోదు చేయాలని గత వారం మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో మారన్ సోదరులతో పాటు ఇతరులను ఈ ఏడాది మార్చిలో సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం తప్పించింది. కాగా, హైకోర్టు ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోబోమని, ఈ విషయాలన్నీ విచారణలో నిర్ధారించాల్సి ఉంటుందని సుప్రీం కోర్టు మారన్ అప్పీల్‌ను తోసిపుచ్చుతూ పేర్కొంది. 2004-06లో దయానిధి మారన్ టెలికాం మంత్రిగా ఉన్న సమయంలో చెన్నైలోని తన ఇంట్లో అక్రమంగా టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ ఏర్పాటు చేశారని, ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు రూ 1.78 కోట్ల నష్టం వాటిల్లిందనే ఆరోపణలు ఆయనపై నమోదయ్యాయి. సన్ టీవీ వ్యాపార లావాదేవీలు నిర్వహించేందుకు, డేటా ట్రాన్స్‌ఫర్‌కు ఈ ఎక్స్ఛేంజ్‌ను ఉపయోగించారని సీబీఐ ఆరోపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment