సుప్రీంలో సుజనాకు చుక్కెదురు | supreme court dismisses Sujana chowdary Universal's appeals | Sakshi
Sakshi News home page

సుప్రీంలో సుజనాకు చుక్కెదురు

Published Fri, Mar 4 2016 12:29 PM | Last Updated on Tue, Oct 16 2018 2:36 PM

supreme court dismisses Sujana chowdary Universal's appeals

యూకే కోర్టు తీర్పు అమలుచేయరాదని కోర్టును ఆశ్రయించిన సుజనా
పిటిషన్‌ను తోసిపుచ్చిన ధర్మాసనం
ఇక మారిషస్ బ్యాంకుకు రూ. 106 కోట్లు చెల్లించాల్సిందే


సాక్షి, న్యూఢిల్లీ: మారిషస్ బ్యాంకుకు రూ. 106 కోట్లు చెల్లించాలని యూకే కోర్టు ఇచ్చిన తీర్పును అమలుచేయరాదని కోరుతూ కేంద్ర మంత్రి సుజనా చౌదరికి చెందిన సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టి వేసింది. తమకు వ్యతిరేకంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేయాలని కోరుతూ సుజనా ఇండస్ట్రీస్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను జస్టిస్ కురియన్‌ జోసెఫ్, జస్టిస్ నారీమన్‌తో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది.

కేంద్ర మంత్రి సుజనా చౌదరికి సంబంధించిన సుజనా యూనివర్శల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ హేస్టియా హోల్డింగ్స్ లిమిటెడ్ సూనేతె మారిషస్ దేశంలో ఒక అనుబంధ కంపెనీ ఏర్పాటుచేసింది. 2010లో మారిషస్ కమర్షియల్ బ్యాంకు(ఎంసీబీ) నుంచి హేస్టియా రూ. 100 కోట్ల మేర రుణం తీసుకుంది. ఈ లావాదేవీలో సుజనా యూనివర్శల్ ఇండస్ట్రీస్ హామీదారుగా ఉంది. రుణానికి సంబంధించి ఎంసీబీకి, హేస్టియాకు మధ్య రాతపూర్వక ఒప్పందం కూడా జరిగింది. ఇంగ్లాండ్ చట్టాలకు లోబడి ఈ ఒప్పందాన్ని అమలు చేస్తున్నట్టు ఆ ఒప్పందంలో పేర్కొన్నారు. అయితే 2012 నుంచి ఎంసీబీకి హేస్టియా కంపెనీ బకాయిలు చెల్లించడం మానేసింది. బకాయిల విషయంలో స్పందించాలంటూ హేస్టియాకు ఎంసీబీ లేఖలు రాసినా ఫలితం దక్కలేదు. గతంలో చేసుకున్న ఒప్పందానికి సవరణలు చేయాలంటూ హేస్టియా కోరడంతో ఎంసీబీ అందుకు అంగీకరించింది. ఆ తరువాత కూడా బకాయిలు చెల్లించకుండా ఒప్పందానికి మరోసారి సవరణలు చేయించింది.

ఇదే సమయంలో ఎంసీబీ అధికారులు హేస్టియా డెరైక్టర్‌గా ఉన్న సుజనా చౌదరితో సంప్రదింపులు జరిపారు. అయినా బకాయిలు మాత్రం చెల్లించలేదు. ఈమొత్తం వ్యవహారంలో ఇంగ్లిష్ కోర్టుల న్యాయపరిధిని సవాలు చేస్తూ హేస్టియా, సుజనా యూనివర్శల్ కంపెనీలు లండన్‌లోని క్వీన్స్ బెంచ్ కమర్షియల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు.. ఇంగ్లిష్ చట్టాల ప్రకారం చేసుకున్న ఒప్పందాల్లో జోక్యం చేసుకున్న అధికారం ఇంగ్లాండ్ కోర్టులకు ఉందని తేల్చిచెప్పింది. అంతేకాక వడ్డీ సహా బకాయి ఉన్న రూ. 105 కోట్లతో పాటు మరో రూ. 72 లక్షలను ఖర్చుల కింద ఎంసీబీకి చెల్లించాలని ఆదేశించింది. ఈ తీర్పును సైతం హేస్టియా, సుజనా కంపెనీలు పట్టించుకోలేదు. దీంతో ఎంసీబీ హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించి లండన్ కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని కోరింది. సిటీ సివిల్ కోర్టులోఎంసీబీకి అనుకూలంగా తీర్పు వెలువడింది. హైకోర్టులో కూడా ఇదే తీర్పు వెలువడింది. తాజాగా శుక్రవారం సుప్రీం కోర్టులో హేస్టియా సంస్థ హైకోర్టు తీర్పు అమలుచేయరాదని కోరుతూ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయగా సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో సుజనా సంస్థ బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ విచారణకు సుజనా గ్రూపు తరపున సీనియర్ న్యాయవాది ఎం.ఎన్.రావు, ఎంసీబీ తరపున సీనియర్ న్యాయవాదులు ధ్రువ్ మెహతా, వసీం బేగ్ హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement