లాయర్ల వీరంగంపై సుప్రీం విచారణ | Supreme Court investigation about lawyers | Sakshi
Sakshi News home page

లాయర్ల వీరంగంపై సుప్రీం విచారణ

Published Wed, Feb 17 2016 1:27 AM | Last Updated on Tue, Aug 21 2018 9:38 PM

లాయర్ల వీరంగంపై సుప్రీం విచారణ - Sakshi

లాయర్ల వీరంగంపై సుప్రీం విచారణ

పటియాలా హౌస్ కోర్టులో హింసపై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం
♦ కన్హయ్య కేసు విచారణ ప్రశాంతంగా సాగేలా చూడాలని పిటిషన్
♦ దాడికి నిరసనగా మీడియా ప్రతినిధుల ర్యాలీ; సుప్రీంకు వినతిపత్రం
 
 న్యూఢిల్లీ: జేఎన్‌యూ విద్యార్థినేత కన్హయ్య కుమార్‌పై నమోదైన రాజద్రోహం కేసు విచారణ సందర్భంగా సోమవారం పటియాలా హౌస్ కోర్టులో చోటు చేసుకున్న హింసపై సుప్రీంకోర్టు స్పందించింది. కోర్టులో జేఎన్‌యూ విద్యార్థులు, ఉపాధ్యాయులు, జర్నలిస్ట్‌లపై దాడులకు పాల్పడిన లాయర్లు, తదితరులపై చర్యలు తీసుకోవడంలో పోలీసుల నిర్లక్ష్యంపై దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. కన్హయ్యకు కోర్టు విధించిన పోలీస్ కస్టడీ నేటి(బుధవారం)తో ముగియనుందని, అందువల్ల మరోసారి పటియాలా కోర్టులో ఆయనను హాజరుపర్చనున్న నేపథ్యంలో మరోసారి హింసకు అవకాశముందని, అందువల్ల తక్షణమే తమ పిటిషన్ విచారణను ప్రారంభించాలని సీనియర్ న్యాయవాది ఇందిర జైసింగ్ చేసిన అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ యూయూ లలిత్‌ల ధర్మాసనం.. బుధవారమే విచారణ ప్రారంభించాలని నిర్ణయించింది. పటియాలా కోర్టులో సోమవారం నాడు జరిగిన హింసలో గాయపడిన జేఎన్‌యూ పూర్వ విద్యార్థి ఎన్‌డీ జయప్రకాశ్ ఈ పిటిషన్ వేశారు. విచారణ నిష్పాక్షికంగా, ప్రశాంత వాతారణంలో జరిగేలా చూడాలన్నారు.

 జర్నలిస్ట్‌ల భారీ ర్యాలీ..
 పటియాల హౌజ్ కోర్టులో పాత్రికేయులపై లాయర్ల దాడిని నిరసిస్తూ మంగళవారం జర్నలిస్ట్‌లు ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించారు. జాతీయ మీడియాకు చెందిన సీనియర్ జర్నలిస్ట్‌లతో పాటు వందలాదిమంది పాత్రికేయులు ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా నుంచి సుప్రీంకోర్టు వరకు ర్యాలీగా సాగారు. మోదీ ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛను సుప్రీంకోర్టు పరిరక్షించాలని కోరుతూ  రిజిష్ట్రార్‌కు వినతిపత్రం అందించారు. మరో బృందం వేరుగా కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసి, కోర్టు ఆవరణలో దాడులను నిలువరించని పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
 
 అంతర్జాతీయ వర్సిటీల మద్దతు
 జేఎన్‌యూలో విద్యార్థుల ఆందోళనలకు ప్రపంచస్థాయి వర్సిటీల్లోని అధ్యాపకుల మద్దతు లభించింది. కేంబ్రిడ్జ్, హార్వర్డ్, కొలంబియా, యేల్ తదితర వర్సిటీల్లోని 455 మంది విద్యావేత్తలు జేఎన్‌యూ విద్యార్థుల ఆందోళనలకు మద్దతుగా ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. ‘ప్రజాస్వామ్యబద్ధ భిన్నాభిప్రాయం, విమర్శనాత్మక ఆలోచనకు  జేఎన్‌యూ వేదికగా నిలుస్తోంది. ఆందోళనలకు మా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం’ అని పేర్కొన్నారు. కాగా, జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్యకుమార్ అరెస్ట్‌కు నిరసనగా వర్సిటీలో విద్యార్థులు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. ఉపాధ్యాయ వర్గం కూడా మంగళవారం స్ట్రైక్‌లో పాల్గొంది. 

జేఎన్‌యూలోకి పోలీసులను తాను పిలవలేదన్న వీసీ వాదనకు విరుద్ధంగా.. జేఎన్‌యూలోకి ప్రవేశించేందుకు వర్సిటీ అధికారుల నుంచి పోలీసులకు అందిన లేఖ వెలుగులోకి వచ్చింది. కాగా, దేశంలో అప్రకటిత అత్యవసర స్థితి నెలకొని ఉందని కాంగ్రెస్ ఆరోపించగా, భారత రాజకీయాల్లో తప్పుదారి పట్టించే నేతల్లో ప్రథముడు రాహుల్ గాంధీ అంటూ బీజేపీ విమర్శించింది. అస్సాంలో ఒక కార్యక్రమంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మాట్లాడుతూ.. హైదరాబాద్, ఢిల్లీ, లక్నోల్లో విద్యార్థుల నోరు నొక్కేస్తోందంటూ మోదీ సర్కారుపై నిప్పులు చెరిగారు. కాగా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్  కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ అయ్యారు.  జేఎన్‌యూ పరిణామాలపైఆందోళన వ్యక్తం చేశారు.  

 మాజీ లెక్చరర్ గిలాని అరెస్టు..
 ఢిల్లీ ప్రెస్ క్లబ్ కార్యక్రమంలో భారత వ్యతిరేక నినాదాలకు సంబంధించిన రాజద్రోహం కేసు ఎదుర్కొంటున్న ఢిల్లీ వర్సిటీ మాజీ లెక్చరర్ గిలానీని సోమవారం అదుపులోకి తీసుకున్న పోలీసులు మంగళ వారం ఆయనను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కాగా, కన్హయ్యపై నమోదైన రాజద్రోహం కేసు విచారణను ఎన్‌ఐఏకు అప్పగించాలంటూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ‘మేం రాజకీయ నాయకులం కాదు. మొదట ప్రభుత్వం పని ప్రభుత్వాన్ని చేయనివ్వండి’ అని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement