ప్రాథమిక విచారణ లేకుండా అరెస్టులు వద్దు
వరకట్న వేధింపుల కేసుల్లో సుప్రీంకోర్టు ఆదేశాలు
న్యూఢిల్లీ: వరకట్న నిరోధక చట్టం దుర్వినియోగం అవుతుండటంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ప్రాథమిక విచారణ చేయకుండా, ఆరోపణలు నిజమో కాదో కనీసం సరిచూడకుండానే ఏ తప్పూ చేయనివారిని అరెస్టు చేయడం తగదంది. ఈ చట్టాన్ని అడ్డుపెట్టుకుని కొన్ని సందర్భాల్లో అమాయకుల హక్కులను హరిస్తున్నారని కోర్టు వ్యాఖ్యానించింది.
ఆరోపణల్లో నిజమెంతో తెలుసుకోకుండా, అనవసరంగా అరెస్టులు చేస్తే...ఆ తర్వాత వివాదం పరిష్కారం అయ్యేందుకు ఉన్న మార్గాలు కూడా మూసుకుపోయే ప్రమాదం ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. భారత శిక్షా స్మృతి (ఐపీసీ)లోని సెక్షన్ 498–ఏ (మెట్టినింట్లో మహిళకు వేధింపులు) కింద వచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు పలు మార్గదర్శకాలు, సూచనలను జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్, జస్టిస్ యూయూ లలిత్‌లతో కూడిన ధర్మాసనం జారీచేసింది.
కుటుంబ సంక్షేమ కమిటీల ఏర్పాటు!
వరకట్న వేధింపుల కేసులను విచారించేందుకు ప్రతి జిల్లాలోనూ కుటుంబ సంక్షేమ కమిటీలను నియమించాలని ధర్మాసనం ఆదేశించింది. ‘498–ఏ కింద వచ్చిన ప్రతి ఫిర్యాదును పోలీసులు లేదా న్యాయాధికారులు ముందుగా ఈ కమిటీలకే పంపాలి. ఫిర్యాదు అందాక కమిటీలు కేసును ప్రాథమికంగా విచారించి గరిష్టంగా నెల రోజుల్లోపే నివేదికను సిద్ధం చేయాలి. ఆ నివేదికలోని అంశాలను బట్టే పోలీసులు అరెస్టుపై నిర్ణయం తీసుకోవాలి. అంతకు ముందే ఎలాంటి అరెస్టులూ ఉండరాదు. అయితే మహిళపై భౌతిక దాడులు చేసినప్పుడు, ఆమె ఒంటిపై గాయాలున్నప్పుడు ఈ మార్గదర్శకాలకు కట్టుబడాల్సిన అవసరం లేదు’ అని పేర్కొంది.
అలాగే ఇలాంటి కేసులను సంబంధిత అనుమతులు ఉన్న అధికారులు మాత్రమే విచారించాలని సూచించింది. ఒకవేళ ఫిర్యాదులో పేర్కొన్న నిందితుడు భారత్‌కు వెలుపల నివసిస్తోంటే, అలాంటివారి పాస్‌పోర్టులను నివేదిక రాకముందే సస్పెండ్ చేయడం, రెడ్ కార్నర్ నోటీసులు జారీచేయడం వంటి చర్యలకు దిగకూడదని కోర్టు పేర్కొంది. కుటుంబ సంక్షేమ కమిటీలను జిల్లా న్యాయసేవల అధికార సంస్థలు నియమించాలని వ్యాఖ్యానించింది. కమిటీల పనితీరును జిల్లా జడ్జి లేదా, సెషన్స్ జడ్జి కనీసం ఏడాదికి ఒకసారైనా సమీక్షించాలంది.