న్యూఢిల్లీ : అయోధ్య భూ వివాదంపై కేసు విచారణను సుప్రీంకోర్టు వచ్చే ఏడాది ఫిబ్రవరి 8కి వాయిదా వేసింది. మంగళవారం కేసుపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతత్వంలోని ముగ్గురు జడ్జిల బెంచ్ ఇరువర్గాల వాదోపవాదనలు వింది. సున్నీ బోర్డు తరఫున వాదన వినిపించిన కపిల్ సిబాల్.. కేసు సంబంధించిన అన్ని పత్రాలు తమకు చేరలేదని విన్నవించారు. కేసు విచారణను 2019 సాధారణ ఎన్నికల అనంతరం చేపట్టాలని కోరారు. లేకుంటే ఎన్నికల ఫలితాలపై తీర్పు ప్రభావం పడే అవకాశం ఉంటుందని చెప్పారు.
సిబాల్ వాదన విన్న ముగ్గురు జడ్జిల బెంచ్ ఎన్నికల వరకూ తీర్పు వాయిదాను తోసి పుచ్చింది. భూ వివాదానికి సంబంధించిన అన్ని వివరాల పత్రాలను అందజేసినట్లు అటార్నీ జనరల్ వేణుగోపాల్ బెంచ్‌కు విన్నవించారు. కేసును ఫిబ్రవరి 8, 2018కి వాయిదా వేస్తున్నట్లు ముగ్గురు జడ్జిల ధర్మాసనం పేర్కొంది.
2010లో భూ వివాదంపై అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై 13 అప్పీళ్లు సుప్రీం కోర్టులో దాఖలు అయ్యాయి. అంతకుముందు ఈ కేసును విచారించిన అలహాబాద్ హైకోర్టు వివాదంలో ఉన్న భూమిని 2.77 ఎకరాల చొప్పున సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మొహీ అఖారా, రామ మందిరాలకు కేటాయించాలని తీర్పును ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment