న్యూఢిల్లీ: అయోధ్య భూవివాదం కేసును సత్వరమే చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసును సత్వరమే విచారించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. రామ జన్మభూమి– బాబ్రీ మసీదు భూవివాదం అంశంపై విచారణను జనవరిలో చేపట్టాలని ఇప్పటికే నిర్ణయించిన నేపథ్యంలో సత్వర విచారణ అవసరం లేదని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్‌కే కౌల్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు వ్యాఖ్యానించింది.
అయోధ్య భూవివాదం విషయంలో సత్వర విచారణ చేపట్టాలని కోరుతూ అఖిల భారత్ హిందు మహాసభ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ‘అయోధ్య వివాదం విషయంలో ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీనికి సంబంధించిన అప్పీళ్లన్నీ జనవరిలో ధర్మాసనం ముందుకు రానున్నాయి. అప్పటి వరకు సత్వర విచారణ చేపట్టలేం’అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ అడ్వొకేట్ సీఎస్ వైద్యనాథన్ వాదనలు వినిపించారు. అయోధ్య అంశం చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో సత్వరమే విచారణ చేపట్టాలని సుప్రీంను కోరారు. ఇక అఖిల భారత్ హిందూ మహాసభ తరఫున లాయర్ బరుణ్ కుమార్ సిన్హా వాదనలు వినిపించారు.
Comments
Please login to add a commentAdd a comment