సైనిక్ సమ్మాన్ పెన్షన్ కు ఆమె అర్హురాలు కాదన్న సుప్రీం
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర సమరయోధుడి భార్య పింఛన్ కోసం జరిపిన సుదీర్ఘ న్యాయ పోరాటంలో ఓడిపోయింది. ఆమె పెన్షన్ కు అర్హురాలు కాదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. స్వాతంత్య్ర పోరాటంలో ఆర్నెల్లకు మించి అజ్ఙాతంలో గడిపినా లేదా ఆర్నెల్లకు మించి జైల్లో ఉన్న వారే పెన్షన్ కు అర్హులంటూ న్యాయమూర్తులు జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఆర్ భానుమతిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చింది.
1942 క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా 13 రోజులు జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి భార్యకు ‘స్వతంత్ర సైనిక్ సమ్మాన్ పెన్షన్ స్కీమ్ 1980’కింద పింఛన్ ఇప్పించాల్సిందిగా కోరుతూ 1993 ఏప్రిల్‌లో అప్పటి బిహార్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అయితే కేంద్రం 2000 జూలైలో ఆమె అందుకు అర్హురాలు కాదని ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఆమెకు మద్దతుగా నిలవటంతో కేంద్రం సుప్రీం కోర్టును ఆదేశించింది. ఆ కేసును ఇటీవల సుప్రీం కోర్టు కొట్టేసింది.