సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం అమల్లోకి వచ్చి నాలుగేళ్లయినా అమలు కాలేదా? అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. విభజన చట్టంలో పొందుపరిచిన హామీల అమలుపై వైఖరి చెప్పాలని కేంద్రాన్ని ఆదేశించింది. దీనిపై 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ.. విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. హామీలు అమలు కావట్లేదని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల భద్రాచలం ఆలయం ముంపునకు గురవుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి దాఖలు చేసిన పిల్‌ను జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది.
విభజన చట్టం అమలుకాకపోవడం వల్ల తెలుగు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రవణ్‌కుమార్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. నాలుగేళ్లయినా చట్టంలోని హామీల అమలు పూర్తి కాలేదా అని జస్టిస్ సిక్రీ వ్యాఖ్యానించారు. కేంద్రం తన వైఖరి తెలిపేందుకు 4 వారాల సమయం కావాలని అదనపు సొలిసిటర్ జనరల్ మణిందర్ సింగ్ ధర్మాసనాన్ని కోరారు. ఏపీ తరఫున అఫిడవిట్ దాఖలు చేసేందుకు సమయం కావాలని ఆ రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది గుంటూరు ప్రభాకర్ విన్నవించారు. వాదనలు విన్న ధర్మాసనం విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment