మార్గదర్శకాలు రూపొందించాం
- న్యాయాధికారుల కేటాయింపులపై సుప్రీంకు కేంద్రం నివేదన
- మార్గదర్శకాలు న్యాయశాఖ పరిశీలనలో ఉన్నాయని వెల్లడి
- వారంలోగా తమ ముందుంచాలన్న అత్యున్నత న్యాయస్థానం
- నియామక సలహా కమిటీ వివరాలు కూడా ఇవ్వాలని సూచన
- విచారణ వచ్చే వారానికి వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం న్యాయాధికారుల నియామక ప్రక్రియకు సంబంధించి సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ మార్గదర్శకాలు రూపొందించిందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించింది. గతేడాది న్యాయాధికారుల కేటాయింపుల ప్రక్రియను సత్వరం తేల్చాలని తెలంగాణ న్యాయమూర్తుల సంఘం సుప్రీంను ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై తాజాగా మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ వాదనలు వినిపించారు.
పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 80 ప్రకారం న్యాయాధికారుల కేటాయింపు ప్రక్రియ చేపట్టాల్సి ఉందని, అందుకు సంబంధించి చట్టం అమల్లోకి వచ్చిన 30 రోజుల్లోపు సలహా కమిటీలను ఏర్పాటు చేయాల్సి ఉందని వివరించారు. అయితే రాష్ట్ర విభజన జరిగి రెండేళ్లు గడిచినప్పటికీ న్యాయాధికారుల కేటాయింపు ప్రక్రియ పూర్తవలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏమంటోందని జస్టిస్ టీఎస్ ఠాకూర్ ప్రశ్నించగా, కేంద్రం తరఫు న్యాయవాది తమకు కొంత సమయం కావాలని విన్నవించారు. దీంతో సాయంత్రం 4 గంటలకు తిరిగి విచారణ ప్రారంభించగా కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ మణిందర్‌సింగ్ వాదనలు వినిపించారు.
రాష్ట్ర విభజన అనంతరం అఖిల భారత సర్వీసు అధికారులు, రాష్ట్ర స్థాయి సర్వీసు అధికారుల కేటాయింపునకు సంబంధించి సలహా కమిటీల సిఫారసుల మేరకు ఇప్పటికే అధికారుల విభజన ప్రక్రియ అమలులో పురోగతి ఉందని మణిందర్ వివరించారు. అయితే న్యాయాధికారుల కేటాయింపులకు సంబంధించి కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ మార్గదర్శకాలు రూపొందించిందని, ఇందుకు ఒక సలహా కమిటీని కూడా ఏర్పాటు చేసిందని తెలిపారు. ప్రస్తుతం మార్గదర్శకాలను ఖరారు చేసేందుకు న్యాయ శాఖ వాటిని పరిశీలిస్తోందని వివరించారు. ఈ నేపథ్యంలో వాటిని ధర్మాసనం ముందుంచాలని, అలాగే కేంద్రానికి ఈ వ్యవహారంలో నోటీసు జారీ చేయాలని ఇందిరా జైసింగ్ కోరారు. అయితే సంబంధిత మార్గదర్శకాలను, సలహా కమిటీ నియామకం, విధివిధానాలు, తదితర వివరాలను అఫిడవిట్ రూపంలో వారంలోపు తమ ముందుంచాలని ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది. ఇందుకు అదనపు సొలిసిటర్ జనరల్ మణిందర్‌సింగ్ సమ్మతించారు. తిరిగి వచ్చే వారం ఈ కేసు విచారణకు రానుంది.