న్యూఢిల్లీ: దేశ రాజధానిలో వాయు కాలుష్యం తారాస్థాయికి చేరడంపై భారత అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ వాయు కాలుష్యంపై సోమవారం వాదనలు విన్న సుప్రీంకోర్టు.. ఢిల్లీ అంతటా ఎయిర్ ప్యూరిఫైయర్ టవర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ప్యూరిఫైయర్ టవర్స్ ఏర్పాటుపై పది రోజుల్లోగా ప్రణాళిక ఖరారు చేయాలని ఢిల్లీ ప్రభుత్వానికి సూచించింది. ఢిల్లీలో రోజురోజుకూ పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని తగ్గించాలని.. ఇందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ విభేదాలు పక్కనపెట్టి కలిసి పని చేయాలని హితవు పలికింది.
ఢిల్లీలో విపరీతంగా పెరిగిన వాయు కాలుష్యంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వెళ్లగక్కింది. తీవ్రమైన కాలుష్యంతో ఢిల్లీ ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని, గ్యాస్ చాంబర్లలో జనం చస్తూ బతుకుతున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. పొగలో నివసించలేక పోతున్నామని అక్కడి జనాలు గగ్గోలుపెడుతున్నారని.. భయాందోళనకు గురవుతున్న నగరవాసులను ఒకేసారి చంపేయండి అని చీవాట్లు పెట్టింది. ఢిల్లీలో మనుగడ సాగించడం నరకం కంటే భయంకరంగా ఉంటుందంటూ సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అంతేకాక ఢిల్లీ జల కాలుష్యాన్ని సైతం తనిఖీ చేస్తామని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
Comments
Please login to add a commentAdd a comment