జల్లికట్టు.. ఆటకట్టు
నిషేధం విధించిన సుప్రీం
గౌరవ మర్యాదలతో జీవించే హక్కు జంతువులకుందని వ్యాఖ్య
న్యూఢిల్లీ: తమిళనాడులో శతాబ్దాలుగా సంప్రదాయంగా వస్తున్న ఎద్దుల వికృత క్రీడ ‘జల్లికట్టు’పై సుప్రీంకోర్టు బుధవారం నిషేధం విధించింది. జంతువులు సహా జీవులన్నిటికీ సహజసిద్ధమైన గౌరవ మర్యాదలుంటాయని, ప్రశాంతంగా జీవించే హక్కు, తమవారిని రక్షించుకునే హక్కు వాటికుంటాయని పేర్కొంది. వాటిని మనం గౌరవించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. జంతువులను అవాంఛితంగా బాధపెట్టకుండా, హింసించకుండా ప్రభుత్వం, భారతీయ జంతు సంక్షేమ బోర్డు(ఏడబ్ల్యూబీఐ) చర్యలు తీసుకోవాలని సూచించింది. జస్టిస్ రాధాకృష్ణన్ నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. మనుషుల నుంచి జరిగే దాడులను ఎదుర్కొంటూ మనగలిగే పరిస్థితి జంతువులకు లేదని, ఆ దృష్ట్యా ‘పేరెన్స్ పేట్రియా’ సిద్ధాంతం కింద వాటి హక్కులను కూడా రక్షించాల్సిన బాధ్యత కోర్టులకుందని అభిప్రాయపడింది. జల్లికట్టును అనుమతిస్తూ మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏడబ్ల్యూబీఐ చేసిన అప్పీలును విచారించిన అనంతరం సుప్రీం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
ఎద్దుల బండి పోటీలపైనా నిషేధం..
తమిళనాడు, మహారాష్ట్ర సహా దేశంలోని ఏ రాష్ట్రం లోనూ ఎద్దులను ప్రదర్శనకు ఉపయోగించే జంతువులుగా చూడరాదని సుప్రీం పేర్కొంది. ఎద్దులను జల్లికట్టు క్రీడలోగాని, ఎద్దుల బండి పోటీలోగాని ఉపయోగించరాదని ఆదేశించింది. ఈ పోటీల్లో ఎద్దులను హింసించే తీరు ఊహకు మించినదని తెలిపిం ది. చాలా దేశాల్లో చేసినట్లే.. జంతువుల హక్కులను కూడా రాజ్యాంగ హక్కుల్లో చేర్చాలనిపార్లమెంటుకు సూచించింది. తమిళనాడులో జల్లికట్టుకు అవకాశం కల్పించే ‘రెగ్యులేషన్ ఆఫ్ జల్లికట్టు-2009’.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 254(1)ను ఉల్లంఘిస్తోందని కోర్టు పేర్కొంది. జల్లికట్టు నిర్వాహకుల్లో పైశాచికత్వానికి, వికృతత్వానికి ఈ క్రీడ పరాకాష్ట అని దుయ్యబట్టింది. తీర్పుపై జంతు హక్కుల సంస్థ ‘పెటా’ సంతోషం వ్యక్తంచేసింది.
అంతర్జాతీయ సమాజం ఉరేసుకోవాలి
మానవ జాతికి ఆనాదిగా సేవ చేస్తున్న జంతువుల హక్కులను గుర్తించన ందుకు అంతర్జాతీయ సమాజం ఉరేసుకోవాలని కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. జంతువుల సంరక్షణ, సంక్షేమానికి హామీనిచ్చే అంతర్జాతీయ ఒప్పందం లేకపోవడం దురదృష్టకరమంది.