కోలీ ఉరిశిక్ష అమలుపై 29వరకూ సుప్రీం స్టే
న్యూఢిల్లీ : నిఠారీ వరుస హత్యల దోషి సురేందర్ కోలీ ఉరిశిక్ష అమలు నిలిపివేతను సుప్రీంకోర్టు మరోసారి పొడిగించింది. కోలీ మరణశిక్ష అమలుపై న్యాయస్థానం ఈనెల 29వరకూ స్టే విధించింది. ఈ మేరకు జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు, జస్టిస్ ఏఆర్ దవేతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది.
కోలీ ఉరి శిక్ష అమలుపై స్టే కోరుతూ గతంలో దాఖలు చేసిన పిటిషన్‌ను జూలైలో కోర్టు కొట్టేయడం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోలీ లాయర్లు రివ్యూ పిటిషన్ వేశారు. ఖైదీల రివ్యూ పిటిషన్‌పై బహిరంగ విచారణ జరపాలని ఈ నెల 2న సుప్రీం ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ.. అప్పటివరకు ఉరి అమలును నిలిపేయాలన్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. శిక్ష అమలుపై స్టే విధించింది. ప్రస్తుం కోలీ మీరట్ జైలులో కట్టుదిట్టమైన భద్రత గల బ్యారక్‌లో ఉన్నాడు.