న్యూఢిల్లీ : ప్రస్తుత పరిస్థితుల్లో మద్యం అమ్మకాలకు సంబంధించి సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మద్యం అమ్మకాల్లో ఆన్‌లైన్ డెలివరీకి ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్రాలకు సూచించింది. మద్యం షాపుల వద్ద భౌతిక దూరం నిబంధన పాటించడానికి, జనాలు పెద్ద ఎత్తున గుమిగూడకుండా ఉండేందుకు హోం డెలివరీ ఉపకరిస్తుందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. లాక్‌డౌన్ వేళ మద్యం అమ్మకాలు సామాన్యుల జీవితంపై ప్రభావం చూసే అవకాశం ఉందని దాఖలైన ప్రజా ప్రయోజన వాజ్యంపై జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సంజయ్ కిషన్, జస్టిస్ బీఆర్ గవైలతో కూడిన ధర్మాసనం శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టింది. (చదవండి : మద్యం హోం డెలివరీకి జొమాటో..!)
అయితే మద్యం అమ్మకాలకు సంబంధించి తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీం ధర్మాసనం ఈ సందర్భంగా తెలిపింది. కానీ రాష్ట్రాలు భౌతిక దూరం నిబంధన అతిక్రమించకుండా ఉండేందుకు మద్యం అమ్మకాల్లో హోం డెలివరీకి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. ఈ విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన లాయర్ దీపక్ సాయి.. ‘మద్యం షాపుల ముందు భౌతిక దూరం నిబంధన పాటించడం కుదరదు. ఎందుకంటే కొన్ని షాపులు మాత్రమే తిరిగి ప్రారంభించడానికి అనుమతి ఇచ్చారు. దీంతో వాటి ముందు పెద్ద సంఖ్యలో జనాలు బారులు తీరారు. మద్యం అమ్మకాల వల్ల సామాన్యుని జీవితానికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదనేదే మా కోరిక. అందుకే మద్యం అమ్మకాలకు సంబంధించి కేంద్ర హోం శాఖ రాష్ట్రాలకు తప్పకుండా స్పష్టత ఇవ్వాలి’ అని కోరారు. (చదవండి : లిక్కర్ ప్రచారంలో దొర్లిన తప్పు.. అధికారుల క్షమాపణ)
కాగా, మూడో దశ లాక్‌డౌన్‌లో భాగంగా కేంద్రం ప్రకటించిన సడలింపులతో పలు రాష్ట్రాల్లో మద్యం షాపులు తెరుచుకున్న సంగతి తెలిసిందే. దీంతో దాదాపు 45 రోజుల పాటు మద్యానికి దూరంగా ఉన్న మందుబాబులు.. ఒక్కసారిగా వైన్ షాపుల ముందు బారులు తీరారు. ముంబైలో ఈ రద్దీ ఎక్కువగా ఉండటంతో.. కేవలం రెండు రోజుల్లోనే మద్యం షాపులను మళ్లీ మూసివేశారు. మరోవైపు ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కూడా మద్యం హోం డెలివరీ రంగంలోకి ప్రవేశించాలని చూస్తోంది. ఇప్పటికే పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు మద్యం హోం డెలివరీ ద్వారా వినియోగదారులకు మద్యం అందజేస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment