అద్వానీ, ఉమాభారతీకి పొంచి ఉన్న గండం!
న్యూఢిల్లీ: బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీకి బాబ్రీ మసీదు ధ్వంసం గండం పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ మరో సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి, ప్రస్తుతం కేంద్రమంత్రిగా పనిచేస్తున్న ఉమాభారతీ, ఇతర బీజేపీ నాయకులు మసీదు ధ్వంసానికి సంబంధించి కుట్ర చేశారనే ఆరోపణలు ఎదుర్కోనున్నట్లు విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ నెల (మార్చి)22న బాబ్రీ మసీదు ధ్వంసానికి సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది.
సుప్రీంలో ఈ కేసుకు సంబంధించి ఇదే చివరి విచారణ కానుందని, ఆ రోజు బీజేపీలో కొందరు సీనియర్ నేతలు ఇంకొందరు కచ్చితంగా కుట్రపూరిత ఆరోపణలు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా లక్నో, రాయబరేలీ ప్రాంతంలో చోటు చేసుకున్న ఘటనలకు సంబంధించి ఎల్‌కే అద్వానీ, ఉమాభారతీకి గండం తప్పకపోవచ్చని అంటున్నారు. 1992, డిసెంబర్ 6న అయోధ్యలోని బాబ్రీ మసీదు ధ్వంసం జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి గతంలోనే వివరణ ఇవ్వాలంటూ అద్వానీ, ఉమా భారతీ, మరో 19మంది నేతలకు నోటీసులు పంపించిన విషయం తెలిసిందే.