సుప్రీం తీర్పు అమలు కష్టమే: సీఎం
రోజుకు 6 వేల క్యూసెక్కుల చొప్పున ఈనెల 27వ తేదీ వరకు ప్రతిరోజూ తమిళనాడుకు కావేరీ జలాలను వదలాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలుచేయడం కష్టమని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులైతే ఇచ్చింది గానీ, మన దగ్గరే నీళ్లు లేవు కాబట్టి దాన్ని అమలుచేయడం చాలా కష్టమని ఆయన విలేకరులతో చెప్పారు. వాస్తవానికి పర్యవేక్షక కమిటీ సూచన ప్రకారం అయితే 3వేల క్యూసెక్కులు మాత్రమే వదలాలి. కానీ సుప్రీం మాత్రం తన ఉత్తర్వుల్లో 6వేల క్యూసెక్కుల నీరు పంపాలని తెలిపింది.
సుప్రీం ఉత్తర్వుల నేపథ్యంలో శాంతిభద్రతలను కాపాడాలని, ప్రశాంతంగా ఉండాలని ప్రజలను సీఎం సిద్దు కోరారు. రాష్ట్ర ప్రజలు, రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బుధవారం ఉదయం ఈ అంశంపై కేబినెట్ సమీక్ష ఉంటుందని, అందులో తాము చర్చిస్తామని చెప్పారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల కాపీ ఇంకా అందాల్సి ఉందని, ఈలోపు న్యాయసలహా కూడా తీసుకుంటామని తెలిపారు. అఖిలపక్ష సమావేశం కూడా బుధవారమే నిర్వహిస్తామని అందులోనూ ఉత్తర్వుల గురించి చర్చిస్తామని అన్నారు.
మేమే కష్టాల్లో మునిగిపోయాం
సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో మాండ్యా ప్రాంత రైతులు తీవ్ర ఆందోళనలో పడ్డారు. ఇప్పటికే తమ పొలాలకు నీళ్లు లేక నానా ఇబ్బందులు పడుతున్నామని, పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయామని, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న నీళ్లన్నీ తమిళనాడుకు ఇచ్చేస్తే ఇక తమ పొలాలు ఎడారులుగా మారిపోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.