
ఉద్యోగులకు కార్లు, ఫ్లాట్లు
సూరత్ వజ్రాల వ్యాపారి దీపావళి కానుక
సూరత్: తన కంపెనీల్లో పనిచేసే ఉద్యోగస్తులకు ప్రతిఏడాదీ ఘనమైన దీపావళి కానుకలిచ్చే సూరత్ వజ్రాల వ్యాపారి సావ్‌జీ ధొలాకియా.. ఈ ఏడాది కూడా భారీ కానుకలను ప్రకటించారు. బాగా పనిచేసే ఉద్యోగులకు 1260 కార్లు, 400 ఫ్లాట్లను కానుకగా ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. ‘హరే కృష్ణ ఎక్స్‌పోర్ట్స్’ పేరుతో వజ్రాల వ్యాపారం చేస్తున్న ధొలాకియా.. ఈ ఏడాది 1716 మంది బాగా పనిచేస్తున్న ఉద్యోగులను గుర్తించామన్నారు. 1100 చదరపు అడుగుల ఇంటికి (ధర 15 లక్షలు), కారుకు మొదటి ఐదేళ్లపాటు రూ.5వేల ఈఎంఐ (నెలసరి వాయిదా)ని కంపెనీ భరిస్తుంది.
తర్వాత మొత్తం ఈఎంఐ (ఇంటికి రూ.11వేలు, కారు ధరను బట్టి) ఉద్యోగే కట్టుకోవాలి. అంటే ఉద్యోగి ఇల్లు కొనుక్కునేందుకు కంపెనీ రూ.3 లక్షలు సాయం (ఉచితం) చేస్తోందన్నమాట. గతేడాది కూడా 491 కార్లు, 200 ఫ్లాట్లను గిఫ్ట్‌గా ఇచ్చిన ఈ కోటీశ్వరుడు.. అంతకుముందు సంవత్సరం.. రూ. 50 కోట్లను పండగబోనస్‌గా ఉద్యోగులకు పంచిపెట్టారు. తన మామయ్య దగ్గరినుంచి అప్పు తీసుకుని వ్యాపారాన్ని మొదలుపెట్టిన ధొలాకియా కోటీశ్వరుడిగా ఎదిగినా.. తన కుమారుడికి డబ్బు విలువ చెప్పేందుకు చిన్న చిన్న ఉద్యోగాలు చేయించిన సంగతి తెలిసిందే.