కృత్రిమ వజ్రాలు తయారీ.. లాభనష్టాలు ఎవరికంటే.. | How To Make Lab Grown Diamonds | Sakshi
Sakshi News home page

కృత్రిమ వజ్రాలు తయారీ.. లాభనష్టాలు ఎవరికంటే..

Published Thu, Feb 22 2024 12:35 PM | Last Updated on Thu, Feb 22 2024 1:30 PM

How To Make Lab Grown Diamonds - Sakshi

వజ్రం అంటే దాదాపు అందరికీ కోహినూర్‌ వజ్రం గుర్తొస్తుంది. భూమిలోపల కొన్ని ఏళ్ల తరబడి చోటు చేసుకున్న రసాయన చర్య ఫలితంగా వజ్రం పుట్టుకొస్తుంది. వజ్రాన్ని కార్బన్‌ ఘన మూలకంగా భావించొచ్చు. అందులోని పరమాణువులు స్ఫటికాల ఆకారంలో కనిపిస్తాయి. దీంతో వజ్రం గట్టిగా ఉంటుంది. ఇతర ఏ పదార్థాల్లో లేని ఉష్ణవాహకత సామర్థ్యం వజ్రంలో ఉంటుంది.

సహజంగా దొరికే వజ్రాల వయసు 1 బిలియన్‌ నుంచి 3.5 బిలియన్‌ సంవత్సరాలు ఉంటుంది. భూమిలో 150 నుంచి 250 కిలోమీటర్ల లోపలికి తవ్వితే కానీ వజ్రాలు లభ్యం కావు. అలాంటి సహజ వజ్రాలకు పోటీగా ఇప్పుడు కృత్రిమ వజ్రాలను తయారుచేస్తున్నారు. తాజాగా యాంట్‌వెర్ప్ వరల్డ్ డైమండ్ సెంటర్ (ఏడబ్ల్యూడీసీ) నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ల్యాబ్ గ్రోన్‌ డైమండ్‌ల మార్కెట్ వాటా 2016లో 1% నుంచి 2024లో 20%కి పెరిగినట్లు తేలింది. 2030లో అది భారీ వృద్ధిని సాధిస్తుందని అంచనా వేసింది.

కృత్రిమ వజ్రం ఎలా తయారు చేస్తారంటే..
న్యూయార్క్‌లోని జనరల్‌ ఎలక్ట్రిక్‌ రీసెర్చ్‌ ల్యాబొరేటరీలో 1954లో తొలిసారి ల్యాబ్‌ గ్రోన్‌ డైమండ్‌ను సృష్టించారు. తరువాత అనేక పరిశోధనలు చేసి వాటి తయారీ వేగం పెంచడానికి రెండు పద్ధతులు కనుగొన్నారు. అందులో ఒకటి అధిక పీడనం, అధిక ఉష్ణం(హెచ్‌పీహెచ్‌టీ) రెండోది రసాయన ఆవిరి నిక్షేపణ(సీవీడీ). ఈ రెండు పద్ధతులకు సీడ్‌ తప్పనిసరి. అంటే ఏదైనా ఇతర డైమండ్‌లోని కొంత భాగం సీడ్‌గా పని చేస్తుంది.

అధిక పీడనం, అధిక ఉష్ణం పద్ధతిలో సీడ్‌, స్వచ్ఛమైన గ్రాఫైట్‌ కార్బన్‌ను ఒక చోట ఉంచుతారు. వాటిని దాదాపు 1500 డిగ్రీల ఉష్ణోగ్రతలో వేడి చేస్తారు. అలాగే పీడనాన్ని కలిగిస్తారు. దాంతో కార్బన్‌ డైమండ్‌గా రూపాంతరం చెందుతుంది. 

రసాయన ఆవిరి నిక్షేపణ విధానంలో కార్బన్‌ రిచ్‌ గ్యాస్‌ నింపిన ఛాంబర్లో సీడ్‌ను ఉంచి 800 డిగ్రీల సెల్సియస్‌  వద్ద వేడి చేస్తారు. దాంతో కార్బన్‌ డైమండ్‌గా మారుతుంది.

నాణ్యత ఎలా ఉంటుందంటే..
భూమిలో నుంచి తవ్వి తీసిన వజ్రాల్లాగే ల్యాబ్‌ వజ్రాలను డైమండ్‌ టెస్టర్‌తో పరీక్షిస్తారు. వాటిలోని కార్బన్‌ మిశ్రమం, ఉష్ణవాహకత ఇంచుమించు సహజ వజ్రాల్లానే ఉంటాయి. దృఢంగా ఉండటంతోపాటు, గీతలు పడవు. కిందపడినా పగిలిపోవు. సహజంగా వజ్రాన్ని ఎలా కోస్తారో వీటిని కూడా అలాగే కోయాల్సి ఉంటుంది. యంత్రాల్లో వినియోగించే కొన్ని లోహాలు గట్టిదనం లేక విరిగిపోతుంటాయి. అటువంటి చోట కృత్రిమ వజ్రాలనే వాడుతున్నారు. కృత్రిమ వజ్రాలతో పనిముట్లు కూడా తయారు చేస్తున్నారు. విద్యుత్‌ తయారీ రంగంలోనూ స్వచ్ఛమైన సింథటిక్‌ డైమండ్లను విరివిగా ఉపయోగిస్తున్నారు. హైపవర్‌ లేజర్‌ డయోడ్స్‌లో వాటిని ఉష్ణవాహకాలుగా వినియోగిస్తున్నారు. 

డిమాండ్‌ ఎలా ఉందంటే..
సహజంగా అరుదుగా దొరికే వాటిపై ఉన్న వ్యామోహం కృత్రిమంగా దొరికే వాటిపై ప్రజలకు ఉండదు. పురాతన వజ్రం అనగానే ధనికులు కోట్లు కుమ్మరించి కొనుగోలు చేస్తుంటారు. కృత్రిమం అనగానే చిన్నచూపు చూస్తారు. నేటి రోజుల్లో వివాహ శుభకార్యాలకు బంగారం కొనడం సర్వ సాధారణమైంది. దాంతో భిన్నంగా ఉండాలని కొందరు వజ్రాల ఉంగరం, వజ్రాల నగల కొనుగోళ్లపై ఆసక్తి చూపిస్తున్నారు.

ఇదీ చదవండి: త్వరలో భారత మొబైల్‌ ఫోన్‌ బ్రాండ్‌

మధ్య తరగతి ప్రజలు కూడా కనీసం ఓ డైమండ్‌ ఉంగరమైనా సరే కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు. ఇలాంటి వారు కృత్రిమ వజ్రాలు ఎంపిక చేసుకుంటే ఖర్చు కలిసి వస్తుందని తయారీదారులు చెబుతున్నారు. అయితే సహజ వజ్రాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉన్న కృత్రిమ వజ్రాల ధర భవిష్యత్తులో మరింత తగ్గిపోవచ్చనే ఊహాగానాలున్నాయి. దాంతో కొనడానికి వెనకడుగు వేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement