ఉద్యోగులకు దీపావళి గిఫ్టుగా 400 ఫ్లాట్లు, 1200 కార్లు!
ఉద్యోగులకు దీపావళి గిఫ్టుగా 400 ఫ్లాట్లు, 1200 కార్లు!
Published Thu, Oct 27 2016 5:26 PM | Last Updated on Mon, Sep 4 2017 6:29 PM
కష్టం విలువ తెలియడం కోసం తన కొడుకును నెల రోజుల పాటు సామాన్యుడిలా కష్టపడి పనిచేసి రావాలని బయటకు పంపేసిన సూరత్ కోటీశ్వరుడు గుర్తున్నాడు కదూ. మూడు జతల దుస్తులు, రూ. 7వేలు మాత్రమే ఇచ్చి, నెల రోజుల పాటు కష్టపడి సొంతంగా సంపాదించి బతకమని.. జీవితం విలువ నేర్పించడానికి పంపేసిన ఆ కోటీశ్వరుడిపేరు సావ్జీ ఢోలకియా. ఆయన ఇప్పుడు తన దగ్గర పనిచేసే ఉద్యోగులకు దీపావళి బహుమతిగా 400 ఫ్లాట్లు, 1200 కార్లు ఇచ్చాడు! హరేకృష్ణ ఎక్స్‌పోర్ట్స్ అనే పేరుతో వజ్రాల వ్యాపారం చేస్తున్న ఢోలకియా.. ఈ ఏడాది తన వ్యాపార స్వర్ణోత్సవం సందర్భంగా దీపావళి బోనస్‌ల కోసం రూ. 51 కోట్లు వెచ్చించారు. కంపెనీలో ఉత్తమ పనితీరు కనబరుస్తున్న 1,716 మందికి ఈ బహుమతులు అందించారు.
ఈ ఒక్క సంవత్సరమే కాదు.. 2011 నుంచి ఇప్పటివరకు ప్రతియేటా ఇలాగే దీపావళి సందర్భంగా ఈ వజ్రాల వ్యాపారి చాలా ఘనంగానే బహుమతులు అందిస్తున్నాడు. గత సంవత్సరం ఈయన 491 కార్లు, 200 ఫ్లాట్లను ఉద్యోగులకు కానుకగా అందించాడు. అంతకుముందు సంవత్సరం కూడా 50 కోట్ల రూపాయల విలువైన బహుమతులు చదివించాడు. (కొడుక్కి వింత పరీక్ష పెట్టిన బిలియనీర్!)
గుజరాత్‌లోని అమ్రేలీ జిల్లాలోగల దుఢాలా అనే కుగ్రామం నుంచి వచ్చిన ఢోలకియా.. తన మామ దగ్గర నుంచి కొంత అప్పు తీసుకుని చిన్నగా వ్యాపారం మొదలుపెట్టి, చివరకు వజ్రాల వ్యాపారంలో చాలా ఎత్తుకు ఎదిగాడు. రాత్రికి రాత్రే డబ్బు సంపాదించడం ఎవరికీ సాధ్యం కాదని, అలా వచ్చిన డబ్బు నిలవదని చెప్పడానికి, డబ్బు విలువ తెలియజెప్పడానికి తన కొడుకు ద్రావ్యను సొంతంగా బతకమని బయటకు పంపేశాడు.
Advertisement