Diwali gifts
-
అదిరిపోయే దివాలీ గిఫ్ట్: సంబరాల్లో కంపెనీ ఉద్యోగులు
హర్యానాలోని ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీ తన ఉద్యోగులకు రానున్న దీపావళికి కార్లను బహుమతిగా ఇచ్చింది. తన ఆఫీస్ హెల్పర్‌తో సహా 12 మంది ఉద్యోగులకు సరికొత్త టాటా పంచ్ కార్లను గిఫ్ట్‌గా అందించింది కంపెనీ. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయింది. అంతేకాదు తన ఉద్యోగులే తనకు సెలబ్రిటీలు అని పేర్కొనడం విశేషంగా నిలిచింది. హర్యానా, పంచకులలోని ఫార్మాస్యూటికల్ కంపెనీ మిట్స్‌కార్ట్ ఛైర్మన్ కార్లను కానుకగా ఇచ్చారు. అంతేకాదు తమ సిబ్బందిపై ప్రశంసలు కురిపించారు. ఛైర్మన్ ఎంకె భాటియా. వారి అంకితభావం, కృషి తనను ముగ్ధుడ్ని చేసిందనీ, అందుకే వారికి ప్రత్యేక బహుమతి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. కంపెనీ ఎన్నో ఒడిదుడుకులను చవి చూసింది అయినా ఉద్యోగులు తమతోనే ఉండి కంపెనీ ఎదుగుదలకు సహకరించారని పేర్కొన్నారు. వాళ్లే తమ స్టార్స్ అంటూ భాటియా సంతోషం వ్యక్తం చేశారు. దీంతో అటు ఉద్యోగుల సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. కారు తాళాలను ఉద్యోగులిస్తున్న వీడియోను లింక్డ్ఇన్ పోస్ట్ చేశారు. కంపెనీ పట్ల వారి నిబద్ధతకు, విశ్వాసానికి గుర్తుగా నెల రోజుల క్రితమే కార్లు అంద జేశానని, అంతేకానీ దీపావళి సందర్బంగా ప్లాన్ చేసింది కాదంటూ వివరించారు. ఈ సమయంలో వార్తలు రావడం యాదృచ్చిక మన్నారు. అలాగే సమీప భవిష్యత్తులో మరో 38 మందికి కూడా ఈ గిప్ట్ ఇవ్వాలని యోచిస్తున్నట్లు మిట్స్‌కార్ట్ యాజమాన్యం తెలిపింది. ఇదిలా ఉంటే కలలో కూడా ఊహించని కార్లను బహుమతిగా అందుకోవడం పట్ల ఉద్యోగులు ఆశ్చర్యానికి లోనయ్యారు.. వారిలో కొందరికి డ్రైవింగ్ కూడా తెలియదట. టాటా పంచ్ టాటా మోటార్స్‌కు చెందిన టాటా పంచ్ 2021 లో లాంచ్ అయింది. టాటా పంచ్ అనేది ఎంట్రీ-లెవల్ మైక్రో SUV. ఈ వెహికల్ ప్రారంభ ధర సుమారు రూ. 6లక్షలు -
జర్నలిస్టులకు లక్షల్లో ‘క్యాష్ గిఫ్ట్‌లు’.. బొమ్మై మెడకు మరో వివాదం!
బెంగళూరు: కర్ణాటక అధికార బీజేపీ ప్రభుత్వం మరో వివాదంలో చిక్కుకుంది. దీపావళి సందర్భంగా ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కార్యాలయానికి చెందిన అధికారి ఒకరు జర్నలిస్టులకు ‘క్యాష్ గిఫ్ట్‌లు’ ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. పలువురు జర్నలిస్టులకు మిఠాయి బాక్సులతో పాటు రూ.లక్ష నుంచి రూ.2.50లక్షల వరకు నగదు పంపినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపించాలని ప్రతిపక్ష కాంగ్రెస్ డిమాండ్ చేసింది. సీఎంఓ స్వీట్ బాక్సులతో లంచాలు ఇచ్చిందని ఆరోపించింది. దీపావళి పండగను పురస్కరించుకుని పలు మీడియా సంస్థలకు చెందిన 10 మందికిపైగా సీనియర్ జర్నలిస్టులకు సీఎంఓ నుంచి స్వీటు బాక్సులు గిఫ్ట్‌లుగా వెళ్లాయి. అయితే అందులో మిఠాయిలతో పాటు రూ.లక్షల్లో డబ్బులు ఉన్నట్లు కొన్ని మీడియా కథనాలు వెల్లడించాయి. స్వీటు బాక్సుల్లో నగదు ఉన్నట్లు ముగ్గురు జర్నలిస్టులు స్వయంగా అంగీకరించినట్లు పేర్కొన్నాయి. సీఎం కార్యాలయం నుంచి వచ్చిన డబ్బును తిప్పి పంపించినట్లు అందులోని ఇద్దరు జర్నలిస్టులు వెల్లడించినట్లు ద న్యూస్ మినట్ పేర్కొంది. ‘సీఎం కార్యాలయం నుంచి నాకు స్వీట్ బాక్సు వచ్చింది. తెరిచి చూడగా అందులో రూ.1 లక్ష క్యాష్ ఉంది. ఈ విషయాన్ని మా ఎడిటర్స్‌కు తెలియజేశాను. ఆ నగదును తాను తీసుకోనని సీఎంఓ అధికారులకు తెలిపాను. ఇది చాలా తప్పు.’ అని మరో జర్నలిస్టు పేర్కొన్నారు. జర్నలిస్టులకు క్యాష్ గిఫ్ట్‌ల వ్యవహారం రాష్ట్రంలో తీవ్ర దుమారానికి దారితీసింది. దీనిపై అవినీతికి వ్యతిరేకంగా పని చేస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థ.. కర్ణాటక లోకాయుక్తకు ఫిర్యాదు చేసింది. ముఖ్యమంత్రి బొమ్మై మీడియా అడ్వైజర్ పలు మీడియా సంస్థల చీఫ్ రిపోర్టర్లకు ఈ గిఫ్ట్‌లు అందించినట్లు ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేసింది. కాంగ్రెస్ విమర్శలు.. జర్నలిస్టులకు నగదు గిఫ్ట్‌ల నేపథ్యంలో బీజేపీ సర్కారుపై ట్విటర్ వేదికగా కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది.‘సర్కారు రూ.లక్షల్లో లంచాలు ఇచ్చేందుకు ప్రయత్నించింది. ఇది సీఎం ఆపర్ చేసిన లంచం కాదా? ఈ లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రభుత్వ ఖజానా నుంచా లేదా సీఎం వ్యక్తిగత ఖాతా నుంచా? దీనిపై ఈడీ/ఐటీ చర్యలు తీసుకుంటుందా? ఈ ప్రశ్నలకు బొమ్మై సమాధానం చెప్పగలరా?’ అని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా ట్విటర్లో విమర్శించారు. దీనిపై జ్యుడిషియల్ దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఇదీ చదవండి: సీఎం ముఖచిత్రంతో ‘పేసీఎం’.. కర్ణాటక సర్కార్‌పై కాంగ్రెస్ అస్త్రం! -
దీపావళికి గిఫ్ట్స్, బోనస్‌లు వచ్చాయా? ట్యాక్స్ ఎంత కట్టాలో తెలుసా?
సాక్షి,ముంబై: దీపావళి పర్వదినం సందర్భంగా ఎవరినుంచైనా గిఫ్ట్స్ తీసుకున్నారా? లేదంటే మీరు పని చేస్తున్న కంపెనీ నుంచి బోనస్ స్వీకరించారా? అయితే ఆదాయపు పన్ను చట్టం ప్రకారం పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. బహుమతులు వాటి స్వభావాన్ని బట్టి ఈ పన్ను వివిధ వర్గాలుగా వర్గీకరించారు. ఈ నేపథ్యంలో పండుగ బహుమతులు, బోనస్‌పై ఎంత ట్యాక్స్ చెల్లించాలో ఒక సారి చూద్దాం. పండుగ సీజన్ వచ్చిందంటే గిఫ్ట్స్, సాలరీ బోనస్ ఇవన్నీ సర్వ సాధారణం. ఉద్యోగులందుకునే బోనస్‌ను కూడా వేతనంగా భావించే ఆదాయ పన్ను శాఖ వాటిపై పన్ను విధిస్తుంది. వేతనాల ఆధారంగా చెల్లించే బోనస్‌కు ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం, కొన్ని బహుమతుల విలువను బట్టి , ఎవరి నుండి స్వీకరించారో బట్టి వాటిపై పన్ను విధించే అవకాశం ఉంది. ఈ బహుమతి మినహాయించిన కేటగిరీ కిందకు రాకపోతే, ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) ఫైల్ చేసేటప్పుడు దానిని కచ్చితంగా బహిర్గతం చేయాల్సి ఉంటుంది. శ్లాబ్ రేటును బట్టి సంబంధిత పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అలా వార్షిక వేతనంతో బోనస్ కూడా కలిపి మొత్తం ఆదాయంపై పన్ను చెల్లించాలి. ► ఒక వ్యక్తి ఆర్థిక సంవత్సరంలో స్వీకరించే బహుమతుల మొత్తం విలువ రూ. 50,000 కంటే ఎక్కువగా ఉంటే, అది ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 56(2) ప్రకారం పన్ను వడ్డింపు ఉంటుంది. ► ఈ బహుమతులు నగదు లేదా రకమైన రూపంలో ఉండవచ్చు. అయితే, దగ్గరి బంధువులు లేదా కుటుంబ సభ్యులు ఇచ్చే బహుమతులకు పన్ను మినహాయింపు ఇచ్చారు. అంటే సోదరుడు, సోదరి, తల్లిదండ్రులు జీవిత భాగస్వామి ఇచ్చే బహుమతులపై పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. ► భూమి లేదా భవనం రూపంలో బహుమతులు వచ్చినట్లయితే, వాటిని స్థిరమైన ఆస్తిగా పరిగణిస్తారు. ఒకవేళ ఈ ఆస్తి స్టాంప్ డ్యూటీ విలువ 50వేల రూపాయలు దాటితే బహుమతిపై పన్ను విధించబడుతుంది. ► అదే సమయంలో గోల్డ్ కాయిన్, సిల్వర్ కాయిన్స్, ఆభరణాలు, పెయింటింగ్‌లు, డ్రాయింగ్లు, షేర్లు/సెక్యూరిటీలు వంటి బహుమతులు, ఇతర వాటితో పాటుగా, చరాస్తుల మార్కెట్ విలువ రూ. 50వేల కంటే ఎక్కువ ఉంటే పన్ను చెల్లించాల్సిందే. -
సిబ్బందికి కార్లు, బైకులు కానుకగా పంచిన ఓనర్
వైరల్/చెన్నై: బాస్‌లలో.. మంచి బాసులు చాలా అరుదు. కేవలం టాస్క్‌లు, టార్గెట్లతో ఇబ్బందులు పెట్టేవాళ్లే ఎక్కువగా కనిపిస్తుంటారు. అయితే.. ఇక్కడో యజమాని.. తన దగ్గర పని చేసే ఉద్యోగులకు కార్లు, బైకులు కానుకలుగా ఇచ్చాడు. ఇది ఎక్కడో జరగలేదు.. మన పొరుగున ఉన్న తమిళనాడు రాష్ట్రంలోనే జరిగింది. దీపావళికి స్వీట్లు, కొత్త బట్టలు పంచే యజమానులనే ఇప్పటిదాకా చూసి ఉంటారు. కానీ, చెన్నైకి చెందిన నగల షాపు ఓనర్ జయంతి లాల్ చాయంతి మాత్రం.. సిబ్బందికి కార్లు, బైకులు ఇచ్చి పెద్ద సర్ప్రైజే ఇచ్చారు. ఈ కానుకలకుగానూ ఆయనకు అక్షరాల కోటి ఇరవై లక్షల ఖర్చు అయ్యింది. ఈ విషయం ఇప్పుడు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. చల్లానీ జ్యువెల్లరీలో పని చేసే ఉద్యోగులకు ఈ దీపావళికి మామూలు కానుకలు దక్కలేదు. వాళ్ల వాళ్ల పర్ఫార్మెన్స్, హోదాలను బట్టి కొంత మందికి బైకులు, మరికొందరికి కార్లను కానుకగా పంచారు జ్యువెలరీ అధినేత జయంతి లాల్ ఛాయంతి. మొత్తం సిబ్బంది కోసం పది కార్లు.. ఇరవై బైకులను పంచారాయన. కుటుంబాలతో సహా భోజనాలకు ఆహ్వానించడంతో.. ప్రతీ ఏడాది షరా మామూలుగా నిర్వహించే కార్యక్రమమే అనుకున్నారంతా. అయితే ఊహించని ఈ సర్ప్రైజ్లు అందుకుంటూ ఉద్యోగుల్లో కొందరు భావోద్వేగానికి లోనై కంట తడి పెట్టుకున్నారు. వీళ్లు ఉద్యోగులు కారు.. నా కుటుంబ సభ్యులు. అందుకే వీళ్లకు ఈ నా విజయంలో.. వైఫల్యంలో.. ప్రతీ అడుగులో వీళ్లు అడుగు వేశారు. నా వెన్నంటే ఉన్నారు. లాభాల బాట పట్టడానికి వీళ్లు చేసిన కృషికి వెలకట్టలేను. కానీ, వాళ్లను ఇలా ప్రొత్సహించాలని అనుకున్నా.. అంతే అని తెలిపారాయన. యజమాని ఊహించిన సర్ప్రైజ్ పట్ల ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. Chennai, Tamil Nadu | A jewellery shop owner gifted cars and bikes to his staff as Diwali gifts They have worked with me through all ups and downs. This is to encourage their work. We are giving cars to 10 people and bikes to 20: Jayanthi Lal, owner of the jewellery shop (16.10) pic.twitter.com/xwUI0sgNRn — ANI (@ANI) October 17, 2022 -
రూ.8500కే ఢోలకియా కార్!
అహ్మదాబాద్ : గుజరాత్ వజ్రాల వ్యాపారి సావ్జీ ఢోలకియా పేరు తెలియని వారుండరు. అదేనండి దీపావళి కానుకగా తన సంస్థ ఉద్యోగులకు ప్రతి ఏడు ఏదో భారీ బహుమతులిస్తాడు చూడు ఆయనే. ఈ ఏడాది కూడా దీపావళి కానుకగా సంస్థలోని 1,700 మందికి కార్లు, ఫిక్స్డ్ డిపాజిట్లను ఇచ్చారు. అయితే దీన్నే క్యాచ్ చేసుకోని సొమ్ము చేసుకోవాలని ప్రయత్నించారు కేడీ గాళ్లు. సావ్జీ ఢోలకియా పేరుతో ఫేక్ ఫేస్బుక్ అకౌంట్స్ క్రియేట్ చేసి రూ.8,500కే కారిస్తున్నట్లు జనాలను మోసం చేయాలని చూశారు. ఢోలకియా తన ఉద్యోగులకు కార్లు పంచుతున్న ఫొటోలను షేర్ చేస్తూ వాటికి క్యాప్షన్‌గా ‘రూ.8500 కే కార్ అనే స్కీమ్’ను వాటికి బ్యాంక్ ఖాతా వివరాలను జత చేసి ప్రచారం చేశారు. ఈ స్కీమ్ ప్రకారం ఎవరైతే రూ.8500 జమచేస్తారో వారి అకౌంట్స్‌లో ఢోలకియా రూ.6 లక్షలు డిపాజిట్ చేస్తారని పేర్కొన్నారు. ఈ మోసాన్ని పసిగట్టిన బ్యాంక్ అధికారులు ఢోలకియా దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుమారు ఐదు ఫేక్ ఐడీలను గుర్తించి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఉద్యోగులకు బొనాంజా -
ఉద్యోగులకు బొనాంజా
సూరత్‌లో జరిగిన కార్యక్రమంలో వజ్రాల వ్యాపారి సావ్జీ ఢోలకియా తన సంస్థ ఉద్యోగులకు దీపావళి కానుకగా ఇచ్చిన కొత్త కార్లు ఇవి. ‘హరే కృష్ణ ఎక్స్‌పోర్ట్స్’ సంస్థలోని 1,700 మంది వజ్రాల నిపుణులు, ఇంజనీర్లకు కానుకగా కార్లు, ఫిక్స్డ్ డిపాజిట్లను ఇచ్చారు. మరోవైపు, ఢోలకియా గురువారం ఢిల్లీలో ప్రధానిని కలసి మోదీ చేతులమీదుగా కొందరు ఉద్యోగులకు కారు తాళాలను ఇప్పించారు. ఈ సందర్భంగా మోదీ వీడియోకాన్ఫరెన్స్‌లో సూరత్‌లోని ఉద్యోగులతో మాట్లాడారు. -
ఉద్యోగులకు దీపావళి గిఫ్టుగా 400 ఫ్లాట్లు, 1200 కార్లు!
కష్టం విలువ తెలియడం కోసం తన కొడుకును నెల రోజుల పాటు సామాన్యుడిలా కష్టపడి పనిచేసి రావాలని బయటకు పంపేసిన సూరత్ కోటీశ్వరుడు గుర్తున్నాడు కదూ. మూడు జతల దుస్తులు, రూ. 7వేలు మాత్రమే ఇచ్చి, నెల రోజుల పాటు కష్టపడి సొంతంగా సంపాదించి బతకమని.. జీవితం విలువ నేర్పించడానికి పంపేసిన ఆ కోటీశ్వరుడిపేరు సావ్జీ ఢోలకియా. ఆయన ఇప్పుడు తన దగ్గర పనిచేసే ఉద్యోగులకు దీపావళి బహుమతిగా 400 ఫ్లాట్లు, 1200 కార్లు ఇచ్చాడు! హరేకృష్ణ ఎక్స్‌పోర్ట్స్ అనే పేరుతో వజ్రాల వ్యాపారం చేస్తున్న ఢోలకియా.. ఈ ఏడాది తన వ్యాపార స్వర్ణోత్సవం సందర్భంగా దీపావళి బోనస్‌ల కోసం రూ. 51 కోట్లు వెచ్చించారు. కంపెనీలో ఉత్తమ పనితీరు కనబరుస్తున్న 1,716 మందికి ఈ బహుమతులు అందించారు. ఈ ఒక్క సంవత్సరమే కాదు.. 2011 నుంచి ఇప్పటివరకు ప్రతియేటా ఇలాగే దీపావళి సందర్భంగా ఈ వజ్రాల వ్యాపారి చాలా ఘనంగానే బహుమతులు అందిస్తున్నాడు. గత సంవత్సరం ఈయన 491 కార్లు, 200 ఫ్లాట్లను ఉద్యోగులకు కానుకగా అందించాడు. అంతకుముందు సంవత్సరం కూడా 50 కోట్ల రూపాయల విలువైన బహుమతులు చదివించాడు. (కొడుక్కి వింత పరీక్ష పెట్టిన బిలియనీర్!) గుజరాత్‌లోని అమ్రేలీ జిల్లాలోగల దుఢాలా అనే కుగ్రామం నుంచి వచ్చిన ఢోలకియా.. తన మామ దగ్గర నుంచి కొంత అప్పు తీసుకుని చిన్నగా వ్యాపారం మొదలుపెట్టి, చివరకు వజ్రాల వ్యాపారంలో చాలా ఎత్తుకు ఎదిగాడు. రాత్రికి రాత్రే డబ్బు సంపాదించడం ఎవరికీ సాధ్యం కాదని, అలా వచ్చిన డబ్బు నిలవదని చెప్పడానికి, డబ్బు విలువ తెలియజెప్పడానికి తన కొడుకు ద్రావ్యను సొంతంగా బతకమని బయటకు పంపేశాడు. -
దక్షిణ భారత నటీనటుల సంఘం దీపావళి కానుక
చెన్నై : దక్షిణ భారత నటీనటుల సంఘం కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టనుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి బాధ్యతలు చేపట్టిన నూతన కార్యవర్గం సంఘం సభ్యులకు దీపావళి పండగ సందర్భంగా కానుక అందించాలని నిర్ణయించింది. కమలహాసన్, రజనీకాంత్ సహా 3500 మంది సభ్యులకు దీపావళి కానుకగా మగ వారికి పంచెలు, మహిళలకు చీరెలతో పాటు స్వీట్లు అందించనున్నట్లు సోమవారం ఒక ప్రకటనలో సంఘం కార్యవర్గం పేర్కొంది. సంఘంలోని కార్యనిర్వాహక వర్గ సభ్యులను కొన్ని బృందాలుగా విభజించి తమిళనాడులోని అన్ని గ్రామాల్లోని నాటక కళాకారులను కలిసి వారి జీవన విధానాన్ని, ఆదాయ అంశాలను, ప్రస్తుత స్థితిగతులను తెలుసుకుని సంఘానికి నివేదించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. దీపావళి పండగ తర్వాత ఆ కార్యక్రమం మొదలవుతుందని వెల్లడించారు. -
మద్యం అమ్మకాలపై ఈసీ దృష్టి
సాక్షి, న్యూఢిల్లీ: దీపావళి కానుకల ముసుగులో ఓటర్లకు ఉచితంగా రాజకీయ పార్టీలు మద్యం పంపిణీ చేయడాన్ని నివారించడం కోసం ఎన్నికల కమిషన్(ఈసీ) అప్రమత్తమైంది. డిసెంబర్ నాలుగున జరుగనున్న ఎన్నికల నేపథ్యంలో ఎక్సైజ్ విభాగంతో కలిసి ఈసీ నగరంలో ఉన్న మద్యం దుకాణాలలోని అమ్మకాలపై నిఘావేసింది. పండుగ సమయంలో మద్యం అమ్మకాలు పెరగడం సాధారణమే. అయితే అసాధారణ రీతిలో భారీగా అమ్మకాలు జరిగితే వాటి వివరాలు సేకరించేందుకు సిద్ధమైంది. నగరంలోని మొత్తం 705 మద్యం దుకాణాలలో సీసీటీవీ కెమెరాలను అమర్చారు. ఈ కెమెరా ఫుటేజ్‌ను ఎక్సైజ్ అధికారులు రోజు విడిచి రోజు ఎన్నికల కార్యాలయానికి అందిస్తున్నారు. ఎక్కడైనా ఏదైనా అసాధారణ కార్యకలాపాలు కొనసాగుతున్నాయేమో గమనించడం కోసం ఈ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. అలాగే ప్రతి దుకాణం, గోదామును రెండురోజులకోసారి తనిఖీ చేయాలని ఈసీ ఇప్పటికే ఫ్లయింగ్ స్క్వాడ్స్ సభ్యులను ఆదేశించింది. 11 ఎక్సైజ్ అధికారుల బృందాలతో కలిసి అదే పనిలో నిమగ్నమయ్యారు. మద్యం దుకాణాలలో అమ్మకాల రికార్డులను పరిశీలించి గతేడాది ఇదే కాలంలో జరిపిన అమ్మకాల రికార్డుతో పోల్చిచూస్తున్నారు. అమ్మకాలు అసాధారణంగా పెరిగినట్లు అనుమానం కలిగితే వాటి తీరుతెన్నులను లోతుగా పరిశీలిస్తోంది. పండుగ సమయంలో మద్యం అమ్మకాలు 8 నుంచి 9 శాతం పెరగడం సాధారణమని, అంతకుమించి పెరిగితే అనుమానించదగినదే అని ఈసీ అంటోంది. భారీగా పెరిగిన మద్యం అమ్మకాలకు, రాజకీయ పార్టీల ప్రచారానికి సంబంధం ఉన్నట్లు ఈ పరిశీలనలో తేలితే చర్యలు తీసుకోనుంది. పొరుగు రాష్ట్రాల సరిహద్దుల మీదుగా మద్యం సరఫరాను నియంత్రించడం కోసం 90 సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద విధులలో ఉన్న పోలీసు సిబ్బందితో కలిసి ఈసీ తనిఖీ బృందాలు, ఎక్సైజ్ అధికారుల బృందాల సభ్యులు ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. ఎన్నికలు జరిగే రాష్ట్రంలోనేకాక ఆ రాష్ట్రానికి పొరుగునున్న రాష్ట్రాలలోని మద్యం దుకాణాలకు కూడా ఎన్నికల సమయంలో ప్రకటించిన సెలవు దినాలను వర్తింపచేయాలని ఈసీ ఆదేశించింది, ‘గుర్తింపు’ లేక ఓటుకు దూరం ఓటర్ జాబితాలో పేర్లు ఉన్నా ఫొటోలు లేకపోవడంతో ఢిల్లీలోని రెండు లక్షల 78 వేల మంది ఓటుహక్కును కోల్పోనున్నారు. డిసెంబర్లో జరగనున్న ఢిల్లీ విధానసభ ఎన్నికల్లో వీరంతా ఓటు వేసేందుకు అనర్హులంటూ అధికారులు పేర్కొం టున్నారు. వీరందరి పేర్లు ఓటర్‌జాబితాలో ఉన్నా దాని ఎదురుగా వారి ఫొటోలే లేవని చెబుతున్నారు. జాబితాలో పేరుతోపాటు త ప్పనిసరిగా ఫొటో ఉన్నవారికి మాత్రమే ఓటుహక్కు వినియోగించుకునేందుకు అవకాశం ఇవ్వనున్నారు. కాగా,అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడడంతో ఓటర్ల సంఖ్య, ఇతర వివరాలపై దృష్టి పెరిగింది. ఢిల్లీ విధానసభ ఎన్నికలకు కేవలం ఒక నెలే గడువు ఉంది. ఇప్పటికీ కొత్త ఓటర్ల పేర్ల నమోదు, చనిపోయిన, చిరునామా మారినవారి పేర్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఓటర్ జాబితాలో మార్పులపై నిర్వహించిన సర్వేల్లో కొందరి పేర్లు ఉన్నా ఫొటోలు లేని విషయం వె ల్లడైంది. రెండు వారాల క్రితం అధికారుల వద్ద ఉన్న సమాచారం మేరకు ఏడు లక్షల మందికి సంబంధించి ఓటర్‌జాబితాలో పేర్లున్నా ఫొటోలు లేవన్న విషయాన్ని గుర్తించారు. మరోమారు పోలింగ్‌బూత్ లెవల్లో సర్వే నిర్వహించగా, నాలుగు లక్షల మంది ఫొటోలను గుర్తించగలిగారు. ఢిల్లీ ఎన్నికల అధికారుల సమాచారం మేరకు ఢిల్లీలో ప్రస్తుతం ఓటర్ల సంఖ్య 1,15,11,036 ఉండగా, వీరిలో పురుషులు 63,81,003, స్త్రీలు 51,29,490 ఉన్నారు.