మద్యం అమ్మకాలపై ఈసీ దృష్టి
Published Wed, Oct 30 2013 11:55 PM | Last Updated on Mon, Sep 17 2018 5:36 PM
సాక్షి, న్యూఢిల్లీ: దీపావళి కానుకల ముసుగులో ఓటర్లకు ఉచితంగా రాజకీయ పార్టీలు మద్యం పంపిణీ చేయడాన్ని నివారించడం కోసం ఎన్నికల కమిషన్(ఈసీ) అప్రమత్తమైంది. డిసెంబర్ నాలుగున జరుగనున్న ఎన్నికల నేపథ్యంలో ఎక్సైజ్ విభాగంతో కలిసి ఈసీ నగరంలో ఉన్న మద్యం దుకాణాలలోని అమ్మకాలపై నిఘావేసింది. పండుగ సమయంలో మద్యం అమ్మకాలు పెరగడం సాధారణమే. అయితే అసాధారణ రీతిలో భారీగా అమ్మకాలు జరిగితే వాటి వివరాలు సేకరించేందుకు సిద్ధమైంది. నగరంలోని మొత్తం 705 మద్యం దుకాణాలలో సీసీటీవీ కెమెరాలను అమర్చారు. ఈ కెమెరా ఫుటేజ్‌ను ఎక్సైజ్ అధికారులు రోజు విడిచి రోజు ఎన్నికల కార్యాలయానికి అందిస్తున్నారు. ఎక్కడైనా ఏదైనా అసాధారణ కార్యకలాపాలు కొనసాగుతున్నాయేమో గమనించడం కోసం ఈ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. అలాగే ప్రతి దుకాణం, గోదామును రెండురోజులకోసారి తనిఖీ చేయాలని ఈసీ ఇప్పటికే ఫ్లయింగ్ స్క్వాడ్స్ సభ్యులను ఆదేశించింది.
11 ఎక్సైజ్ అధికారుల బృందాలతో కలిసి అదే పనిలో నిమగ్నమయ్యారు. మద్యం దుకాణాలలో అమ్మకాల రికార్డులను పరిశీలించి గతేడాది ఇదే కాలంలో జరిపిన అమ్మకాల రికార్డుతో పోల్చిచూస్తున్నారు. అమ్మకాలు అసాధారణంగా పెరిగినట్లు అనుమానం కలిగితే వాటి తీరుతెన్నులను లోతుగా పరిశీలిస్తోంది. పండుగ సమయంలో మద్యం అమ్మకాలు 8 నుంచి 9 శాతం పెరగడం సాధారణమని, అంతకుమించి పెరిగితే అనుమానించదగినదే అని ఈసీ అంటోంది. భారీగా పెరిగిన మద్యం అమ్మకాలకు, రాజకీయ పార్టీల ప్రచారానికి సంబంధం ఉన్నట్లు ఈ పరిశీలనలో తేలితే చర్యలు తీసుకోనుంది. పొరుగు రాష్ట్రాల సరిహద్దుల మీదుగా మద్యం సరఫరాను నియంత్రించడం కోసం 90 సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద విధులలో ఉన్న పోలీసు సిబ్బందితో కలిసి ఈసీ తనిఖీ బృందాలు, ఎక్సైజ్ అధికారుల బృందాల సభ్యులు ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. ఎన్నికలు జరిగే రాష్ట్రంలోనేకాక ఆ రాష్ట్రానికి పొరుగునున్న రాష్ట్రాలలోని మద్యం దుకాణాలకు కూడా ఎన్నికల సమయంలో ప్రకటించిన సెలవు దినాలను వర్తింపచేయాలని ఈసీ ఆదేశించింది,
‘గుర్తింపు’ లేక ఓటుకు దూరం
ఓటర్ జాబితాలో పేర్లు ఉన్నా ఫొటోలు లేకపోవడంతో ఢిల్లీలోని రెండు లక్షల 78 వేల మంది ఓటుహక్కును కోల్పోనున్నారు. డిసెంబర్‌లో జరగనున్న ఢిల్లీ విధానసభ ఎన్నికల్లో వీరంతా ఓటు వేసేందుకు అనర్హులంటూ అధికారులు పేర్కొం టున్నారు. వీరందరి పేర్లు ఓటర్‌జాబితాలో ఉన్నా దాని ఎదురుగా వారి ఫొటోలే లేవని చెబుతున్నారు. జాబితాలో పేరుతోపాటు త ప్పనిసరిగా ఫొటో ఉన్నవారికి మాత్రమే ఓటుహక్కు వినియోగించుకునేందుకు అవకాశం ఇవ్వనున్నారు. కాగా,అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడడంతో ఓటర్ల సంఖ్య, ఇతర వివరాలపై దృష్టి పెరిగింది.
ఢిల్లీ విధానసభ ఎన్నికలకు కేవలం ఒక నెలే గడువు ఉంది. ఇప్పటికీ కొత్త ఓటర్ల పేర్ల నమోదు, చనిపోయిన, చిరునామా మారినవారి పేర్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఓటర్ జాబితాలో మార్పులపై నిర్వహించిన సర్వేల్లో కొందరి పేర్లు ఉన్నా ఫొటోలు లేని విషయం వె ల్లడైంది. రెండు వారాల క్రితం అధికారుల వద్ద ఉన్న సమాచారం మేరకు ఏడు లక్షల మందికి సంబంధించి ఓటర్‌జాబితాలో పేర్లున్నా ఫొటోలు లేవన్న విషయాన్ని గుర్తించారు. మరోమారు పోలింగ్‌బూత్ లెవల్‌లో సర్వే నిర్వహించగా, నాలుగు లక్షల మంది ఫొటోలను గుర్తించగలిగారు. ఢిల్లీ ఎన్నికల అధికారుల సమాచారం మేరకు ఢిల్లీలో ప్రస్తుతం ఓటర్ల సంఖ్య 1,15,11,036 ఉండగా, వీరిలో పురుషులు 63,81,003, స్త్రీలు 51,29,490 ఉన్నారు.
Advertisement