savji dholakia
-
రూ.12 వేల కోట్ల వ్యాపారాధిపతి.. రూ.200 కోసం బేకరీలో పని..!
సూరత్‌లోని అత్యంత ధనవంతుడిగా ఉన్న సావ్జీ ధంజీ ధోలాకియా.. ‘ఏదీ మన చెంతకురాదు.. శోధించి.. సాధించాలి’ అని నమ్మారేమో. సులభంగా సంపద వస్తే దాన్ని నిర్వహించడం కష్టమవుతుందని భావించిన ఆయన తన కుమారుడిని స్వతంత్రంగా పనిచేయమని ప్రోత్సహించారు. దాంతో ఆయన కుమారుడు ఏకంగా బేకరీలో పనిచేసేందుకు సిద్ధపడ్డాడు. ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నాడో ఈ కథనంలో తెలుసుకుందాం. రైతు కుటుంబంలో జన్మించిన సావ్జీ ధంజీ ధోలాకియా హరికృష్ట ఎక్స్‌పోర్ట్స్ పేరుతో కంపెనీ స్థాపించి వజ్రాలను తయారుచేస్తున్నారు. వాటిని ఎగుమతి చేస్తూ వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించారు. సావ్జీ ధోలాకియా 1962 ఏప్రిల్ 12న గుజరాత్‌లోని దుధాలా గ్రామంలో జన్మించారు. ఆయనకు ముగ్గురు సోదరులు ఉన్నారు. ఆర్థికస్థోమత లేకపోవటంతో సావ్జీ నాలుగో తరగతిలోనే చదువు మానేయాల్సి వచ్చింది. తర్వాత తన మామతో కలిసి సూరత్‌కు వచ్చి అక్కడే పనిచేశారు. మామయ్యకు చెందిన వజ్రాల వ్యాపారంలో సావ్జీ తన సోదరులు హిమ్మత్, తులసితో కలిసి పనిచేశారు. అలా 1992లో సావ్జీ తన ముగ్గురు సోదరులతో కలిసి హరి కృష్ణ ఎక్స్‌పోర్ట్స్ కంపెనీని స్థాపించారు. ఈ కంపెనీకి చెందిన డైమండ్ కటింగ్, పాలిషింగ్ యూనిట్‌ను సూరత్‌లో ఏర్పాటు చేశారు. ముంబైలో ఎగుమతి కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. 2014 నాటికి కంపెనీ ఎంతో వృద్ధి సాధించింది. అప్పటికే కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 6,500కు చేరింది. ఆ తర్వాత 2005లో 'కిస్నా' పేరుతో ఆభరణాల బ్రాండ్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం ఇది దేశవ్యాప్తంగా 6,250 అవుట్లెట్లతో అతిపెద్ద వజ్రాభరణాల బ్రాండ్‌గా కొనసాగుతోంది. ధోలాకియా తరచూ తమ కంపెనీ ఉద్యోగులకు దీపావళి బోనస్‌గా కార్లు, ఫ్లాట్లు, ఆభరణాలను బహుమతిగా ఇస్తుంటారు. అంతేకాదు కుటుంబం సావ్జీకు గిఫ్ట్‌గా ఇచ్చిన హెలికాప్టర్‌ను సూరత్‌లో వైద్యం ఇతర అత్యవసర పరిస్థితుల కోసం గతంలో రూ.50 కోట్ల బ్రాండ్-న్యూ ఛాపర్‌ని విరాళంగా అందించాలని నిర్ణయించడం విశేషం. అలాగే గుజరాత్‌లోని అమ్రేలి జిల్లా, లాఠీ తాలూకా తన స్వస్థలంలో ఇప్పటికే 75 చెరువులను నిర్మించడమేకాదు 20 లక్షలకుపైగా మొక్కల్ని నాటారు. అయితే సులభంగా సంపదను పొందితే దాన్ని నిర్వహించటం వారసులకు అంత సులువు కాదు. అయితే మనుగడ కోసం మనుషులు చేసే పోరాటం గురించి తెలుసుకుంటేనే.. ప్రతి రూపాయినీ ఎలా ఖర్చు చేయాలి అనే జీవిత పాఠాలు తెలుస్తాయి. ఇదే నియమాన్ని పాటించాలని ఆ వజ్రాల వ్యాపారి తన కుమారుడికి చెప్పారు. అయితే సంపాదన కోసం లేదా పనికోసం తన పేరును ఎక్కడా వాడకూడదని సావ్జీ కండిషన్ పెట్టారు. ఇదీ చదవండి: కొత్త నిబంధన.. ఆ ఆన్లైన్ లావాదేవీలకు 4 గంటలు ఆగాల్సిందే..! దాంతో సావ్జీ ధంజీ ధోలాకియా కుమారుడు ద్రవ్యను ఇంటి పేరును ఉపయోగించకుండా స్వతంత్రంగా పనిచేయమని ప్రోత్సహించాడు. కేవలం రూ.7 వేలతో ఇంటి నుంచి బయటకు వచ్చిన ద్రవ్య.. షూ స్టోర్, మెక్‌డొనాల్డ్స్, కాల్ సెంటర్‌తో సహా అనేక ఉద్యోగాలు చేశాడు. చివరికి ఒక బేకరీలో రోజుకు రూ.200 జీతానికి ఉద్యోగం సంపాదించాడు. కొంత ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ, విలువైన జీవిత పాఠాలు నేర్చుకున్నట్లు ద్రవ్య చెప్పాడు. అలా సదరు వ్యాపారి తన పిల్లలకు అసలైన జీవిత పాఠాలను నేర్పించారు. 27 ఏళ్ల ద్రవ్య కంపెనీనీ టేకోవర్ చేశారు. 2016 లెక్కల ప్రకారం హరికృష్ణ డైమండ్ ఎక్స్‌పోర్ట్స్ కంపెనీ రూ.12000 కోట్ల మార్కెట్ క్యాపిటల్ కలిగి ఉంది. దాదాపు 71 దేశాల్లో వ్యాపారం సాగిస్తోంది. -
యజమానులు ఉద్యోగులకు కార్లు గిప్ట్ గా ఇస్తారా? ఇదిగో ఈయన ఇస్తున్నాడు!!
కేరళకు చెందిన ఓ బిజినెస్ మ్యాన్ పద్మశ్రీ అవార్డ్ గ్రహిత,వజ్రాల వ్యాపారి సావ్జీ ఢోలాకియాను గుర్తు చేస్తున్నారు. తన సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు బెంజ్ కార్లతో పాటు మరెన్నో బహుమతుల్ని అందిస్తూ హాట్ టాపిగ్గా నిలుస్తున్నారు. కేరళకు చెందిన ఏకే షాజీ మైజీ డిజిటల్ రీటైల్ బిజినెస్ నిర్వహిస్తున్నారు. అయితే ఆ సంస్థలో చీఫ్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్‌గా సీఆర్ అనీష్ 22ఏళ్లుగా పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గత 22 సంవత్సరాలుగా వ్యాపారవేత్త ఎకె షాజీతో కలిసి పనిచేస్తున్న సీఆర్ అనీష్ విధేయతకు గుర్తుగా మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎ క్లాస్ 220 డి కారును ప్రజెంట్ చేశాడు. ఈ సందర్భంగా ప్రియమైన అనీ గత 22 సంవత్సరాలుగా మీరు నాకు బలమైన స్తంభంలా ఉన్నారు. మీరు మీ కొత్త క్రూజింగ్ భాగస్వామిని ప్రేమిస్తున్నారని ఆశిస్తున్నాను అంటూ వ్యాపారవేత్త ఉద్యోగి, అతని కుటుంబ సభ్యులకు బ్లాక్ లగ్జరీ ఎస్‌యూవీని బహుమతిగా ఇచ్చిన ఫోటోల్ని జత చేస్తూ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. గతంలో ఉద్యోగులకు విశ్వసనీయతకు ప్రతిఫలమివ్వడం ఇదే మొదటిసారి కాదు. రెండేళ్ల క్రితం షాజీ తన ఉద్యోగులకు ఆరుగురు చొప్పున కారును బహుమతిగా ఇచ్చాడు. కాగా, గుజరాత్ వజ్రాల వ్యాపారి సావ్జీ ధోలాకియా తన ఉద్యోగులకు విలాసవంతమైన బహుమతుల్ని అందించారు. 018లో దీపావళికి తన ఉద్యోగులకు 600 కార్లు ఇచ్చాడు. 3 కోట్ల విలువైన మూడు మెర్సిడెజ్ బెంజ్ జీఎల్ఎస్ ఎస్‌యూవీలను ఉద్యోగులకు బహుమతిగా ఇచ్చి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. -
‘అమ్మాయిలూ మీరు పతకం తేండి.. ఇల్లు.. కారు నేనిస్తా’
అహ్మదాబాద్: ఒలింపిక్స్ పోటీల్లో భారతీయ క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు వీరోచితంగా పోరాడుతున్నారు. ఇప్పటివరకు ఐదు పతకాలు రాగా వాటిలో మూడు అమ్మాయిలు సాధించినవే. తాజాగా ఈ పోటీల్లో భారత మహిళల హాకీ జట్టు ఆశలు కల్పిస్తోంది. సెమీ ఫైనల్‌కు వెళ్లిన రాణి జట్టు ఎలాగైనా పతకం సాధించాలనే పట్టుతో ఉంది. ఇప్పటికే పురుషుల హాకీ జట్టు నాలుగు దశాబ్దాల అనంతరం ఒలింపిక్ పతకం సొంతం చేసుకుంది. ఇప్పుడు మహిళలపై ఆశలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలో ఆ అమ్మాయిలకు నగదు ప్రోత్సహాకాలు, కానుకల ఆఫర్లు వెల్లువలా వస్తున్నాయి. తాజాగా గుజరాత్‌కు చెందిన ప్రముఖ వజ్రాల వ్యాపారి, హెచ్‌కే గ్రూప్ అధినేత సావ్జీ ఢోలాకియా అమ్మాయిల హాకీ జట్టుకు వరాలు ప్రకటించారు. ‘మీరు పతకం తీసుకురండి.. మీకు ఇల్లు లేదా కారు ఇస్తా’ అని ప్రకటించారు. అమ్రేలీ జిల్లాలోని ధుహల గ్రామానికి చెందిన ధోలాకియా హరికృష్ణ ఎక్స్‌పోర్ట్స్ కంపెనీ ప్రారంభించి ప్రస్తుతం రూ.7 వేల కోట్ల టర్నోవర్ పొందుతున్నారు. మొదటిసారి మహిళల జట్టు సెమీ ఫైనల్‌కు చేరింది. 130 కోట్ల భారతీయుల కలను మోస్తున్నారు. నేను వారికి అందించే ఇది చిన్న సహాయం. ఇది వారి నైతిక సామర్థ్యం పెంపునకు.. ప్రోత్సాహానికి దోహదం చేస్తుందని భావిస్తున్నా. రజత పతక విజేత మీరాబాయి చానును స్ఫూర్తిగా తీసుకున్నట్లు తెలిపారు. అతి చిన్న ఇంట్లో ఉంటూనే చాను ఒలింపిక్స్‌లో పతకం సాధించింది. ఈ నేపథ్యంలోనే హాకీ క్రీడాకారులకు రూ.11 లక్షలు ఇంటి నిర్మాణం కోసం ఇస్తున్నట్లు ధోలాకియా వివరించారు. ఇల్లు వద్దనుకునే వారికి కారు కొనుగోలు కోసం రూ.5 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. దీంతోపాటు తన స్నేహితుడు డాక్టర్ కమలేశ్ డేవ్ ప్రతీ క్రీడాకారుడికి రూ.లక్ష నగదు బహుమతి ఇచ్చేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. ధొలాకియా తన సంస్థలోని ఉద్యోగులను కుటుంబసభ్యుల్లాగా చూసుకుంటారు. ప్రతి దీపావళికి ఉద్యోగులకు భారీ కానుకలు ఇస్తుంటారు. చాలాసార్లు ఉద్యోగులకు ఖరీదైన కార్లు, ఆభరణాలు, ప్లాట్లు ఇచ్చిన విషయం తెలిసిందే. The group has also decided to award others (who have a house) with a brand-new car worth Rs 5 lakhs if the team brings home a medal. Our girls are scripting history with every move at Tokyo 2020. We’re into the semi-finals of the Olympics for the 1st time beating Australia. — Savji Dholakia (@SavjiDholakia) August 3, 2021 -
రూ.8500కే ఢోలకియా కార్!
అహ్మదాబాద్ : గుజరాత్ వజ్రాల వ్యాపారి సావ్జీ ఢోలకియా పేరు తెలియని వారుండరు. అదేనండి దీపావళి కానుకగా తన సంస్థ ఉద్యోగులకు ప్రతి ఏడు ఏదో భారీ బహుమతులిస్తాడు చూడు ఆయనే. ఈ ఏడాది కూడా దీపావళి కానుకగా సంస్థలోని 1,700 మందికి కార్లు, ఫిక్స్డ్ డిపాజిట్లను ఇచ్చారు. అయితే దీన్నే క్యాచ్ చేసుకోని సొమ్ము చేసుకోవాలని ప్రయత్నించారు కేడీ గాళ్లు. సావ్జీ ఢోలకియా పేరుతో ఫేక్ ఫేస్బుక్ అకౌంట్స్ క్రియేట్ చేసి రూ.8,500కే కారిస్తున్నట్లు జనాలను మోసం చేయాలని చూశారు. ఢోలకియా తన ఉద్యోగులకు కార్లు పంచుతున్న ఫొటోలను షేర్ చేస్తూ వాటికి క్యాప్షన్‌గా ‘రూ.8500 కే కార్ అనే స్కీమ్’ను వాటికి బ్యాంక్ ఖాతా వివరాలను జత చేసి ప్రచారం చేశారు. ఈ స్కీమ్ ప్రకారం ఎవరైతే రూ.8500 జమచేస్తారో వారి అకౌంట్స్‌లో ఢోలకియా రూ.6 లక్షలు డిపాజిట్ చేస్తారని పేర్కొన్నారు. ఈ మోసాన్ని పసిగట్టిన బ్యాంక్ అధికారులు ఢోలకియా దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుమారు ఐదు ఫేక్ ఐడీలను గుర్తించి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఉద్యోగులకు బొనాంజా -
ఉద్యోగులకు బొనాంజా
సూరత్‌లో జరిగిన కార్యక్రమంలో వజ్రాల వ్యాపారి సావ్జీ ఢోలకియా తన సంస్థ ఉద్యోగులకు దీపావళి కానుకగా ఇచ్చిన కొత్త కార్లు ఇవి. ‘హరే కృష్ణ ఎక్స్‌పోర్ట్స్’ సంస్థలోని 1,700 మంది వజ్రాల నిపుణులు, ఇంజనీర్లకు కానుకగా కార్లు, ఫిక్స్డ్ డిపాజిట్లను ఇచ్చారు. మరోవైపు, ఢోలకియా గురువారం ఢిల్లీలో ప్రధానిని కలసి మోదీ చేతులమీదుగా కొందరు ఉద్యోగులకు కారు తాళాలను ఇప్పించారు. ఈ సందర్భంగా మోదీ వీడియోకాన్ఫరెన్స్‌లో సూరత్‌లోని ఉద్యోగులతో మాట్లాడారు. -
ఉద్యోగులకు 1200 కార్ల బోనస్!
ప్రతి నెలా ఉద్యోగులకు జీతాలు ఇవ్వడమే కాదు, కొన్ని సంస్థలు ప్రతియేటా తాము ఉద్యోగులకు బోనస్‌లు కూడా ఇస్తున్నట్లు చెబుతాయి. అందరి విషయం ఏమో గానీ, గుజరాత్‌కు చెందిన వజ్రాల వ్యాపారులు మాత్రం ఈ బోనస్‌ల విషయంలో అందరి కంటే ఒక మెట్టు పైనే ఉంటారు. ఇప్పటికే ఇలాంటి బోనస్‌లు చాలా ఇచ్చిన హరే కృష్ణ ఎక్స్‌పోర్టర్స్ యజమాని సావ్జీభాయ్ ఢోలకియా ఈసారి తన ఉద్యోగుల్లో 1200 మందికి కార్లు బోనస్‌గా ఇచ్చారు. 2013 నుంచి ఆయన ఈ ట్రెండ్ మొదలుపెట్టారు. ఈసారి డాట్సన్ కంపెనీ నుంచి కార్లు కొనుగోలు చేసి మరీ తన ఉద్యోగులకు ఆయన ఉచితంగా పంచిపెట్టారు. డాట్సన్ సంస్థ ఉత్పత్తి చేసే రెడీ-గో కార్లను ఆయన కొన్నారు. ఒక రోజుకు డాట్సన్ కంపెనీ 650 కార్లు డెలివరీ ఇవ్వగలదు. అందుకే ముందుగానే ఆ కార్లకు ఆర్డర్ చేసి మరీ వాటిని తెప్పించారు. గత సంవత్సరం ఎలాంటి ప్రోత్సాహకాలు పొందని వారికి ఈసారి ఈ కార్లు ఇచ్చారు. ఈ కార్లన్నింటి మీద భారతీయ జెండాలోని మూడు రంగుల స్టిక్కర్లు కూడా ఉన్నాయి. అయితే ఈసారి మాత్రం ఇందులో చిన్న మెలిక పెట్టారు. కార్లన్నింటికీ డౌన్ పేమెంట్ కట్టేసిన ఢోలకియా, మిగిలిన మొత్తాన్ని ఐదేళ్లకు అప్పుగా తీసుకున్నారు. దాని ఈఎంఐలను కూడా కంపెనీయే కడుతుంది. అయితే ఉద్యోగి ఈలోపు కంపెనీ నుంచి వెళ్లిపోతే మాత్రం.. అప్పటినుంచి అతడే మిగిలిన ఈఎంఐలు కట్టుకోవాల్సి ఉంటుంది. డాట్సన్ రెడీ-గో కార్ల ఢిల్లీ షోరూం ధర రూ. 2.38 లక్షలు ఉంది. చిన్నకార్ల సెగ్మెంటులో ఇది మార్కెట్లో బాగానే దూసుకెళ్తోంది. -
కార్లు, ఫ్లాట్లు ఇచ్చాడు కానీ..
సూరత్: గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి సావ్జీ దోలాకియా.. తన కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు దీపావళి కానుకగా కార్లు, ఫ్లాట్లు, బంగారు ఆభరణాలు ఇచ్చి కార్పొరేట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. మీడియాలో ఆయన పేరు మార్మోగిపోయింది. సావ్జీ తాజాగా మరోసారి వార్తల్లోకెక్కాడు. అయితే ఈ సారి దానగుణంతో గాక ఉద్యోగులను మోసం చేసినట్టు అపవాదు ఎదుర్కొన్నాడు. హరే కృష్ట ఎక్స్‌పోర్ట్స్ చైర్మన్ అయిన సావ్జీ.. తన కంపెనీలో పనిచేసే ఉద్యోగుల ఈపీఎఫ్ ఖాతాల్లో జమచేయాల్సిన 16.66 కోట్ల రూపాయలను చెల్లించలేదు. ఈపీఎఫ్ఓ సూరత్ బ్రాంచ్.. సావ్జీ కంపెనీకి ఈ మేరకు నోటీసులు పంపింది. 15 రోజుల్లోపు ఈ మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, కంపెనీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేస్తామని హెచ్చరించింది. సావ్జీ కంపెనీలో 3165 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కాగా పీఎఫ్ ఎగవేసేందుకు నిబంధనలకు విరుద్ధంగా తక్కువ మంది పనిచేస్తున్నట్టు చూపినట్టు ఆరోపణలు వచ్చాయి. చాలా ఏళ్లుగా ఆయన కంపెనీలో పనిచేసే ఉద్యోగుల పీఎఫ్ చెల్లించడం లేదు. -
ఉద్యోగులకు దీపావళి గిఫ్టుగా 400 ఫ్లాట్లు, 1200 కార్లు!
కష్టం విలువ తెలియడం కోసం తన కొడుకును నెల రోజుల పాటు సామాన్యుడిలా కష్టపడి పనిచేసి రావాలని బయటకు పంపేసిన సూరత్ కోటీశ్వరుడు గుర్తున్నాడు కదూ. మూడు జతల దుస్తులు, రూ. 7వేలు మాత్రమే ఇచ్చి, నెల రోజుల పాటు కష్టపడి సొంతంగా సంపాదించి బతకమని.. జీవితం విలువ నేర్పించడానికి పంపేసిన ఆ కోటీశ్వరుడిపేరు సావ్జీ ఢోలకియా. ఆయన ఇప్పుడు తన దగ్గర పనిచేసే ఉద్యోగులకు దీపావళి బహుమతిగా 400 ఫ్లాట్లు, 1200 కార్లు ఇచ్చాడు! హరేకృష్ణ ఎక్స్‌పోర్ట్స్ అనే పేరుతో వజ్రాల వ్యాపారం చేస్తున్న ఢోలకియా.. ఈ ఏడాది తన వ్యాపార స్వర్ణోత్సవం సందర్భంగా దీపావళి బోనస్‌ల కోసం రూ. 51 కోట్లు వెచ్చించారు. కంపెనీలో ఉత్తమ పనితీరు కనబరుస్తున్న 1,716 మందికి ఈ బహుమతులు అందించారు. ఈ ఒక్క సంవత్సరమే కాదు.. 2011 నుంచి ఇప్పటివరకు ప్రతియేటా ఇలాగే దీపావళి సందర్భంగా ఈ వజ్రాల వ్యాపారి చాలా ఘనంగానే బహుమతులు అందిస్తున్నాడు. గత సంవత్సరం ఈయన 491 కార్లు, 200 ఫ్లాట్లను ఉద్యోగులకు కానుకగా అందించాడు. అంతకుముందు సంవత్సరం కూడా 50 కోట్ల రూపాయల విలువైన బహుమతులు చదివించాడు. (కొడుక్కి వింత పరీక్ష పెట్టిన బిలియనీర్!) గుజరాత్‌లోని అమ్రేలీ జిల్లాలోగల దుఢాలా అనే కుగ్రామం నుంచి వచ్చిన ఢోలకియా.. తన మామ దగ్గర నుంచి కొంత అప్పు తీసుకుని చిన్నగా వ్యాపారం మొదలుపెట్టి, చివరకు వజ్రాల వ్యాపారంలో చాలా ఎత్తుకు ఎదిగాడు. రాత్రికి రాత్రే డబ్బు సంపాదించడం ఎవరికీ సాధ్యం కాదని, అలా వచ్చిన డబ్బు నిలవదని చెప్పడానికి, డబ్బు విలువ తెలియజెప్పడానికి తన కొడుకు ద్రావ్యను సొంతంగా బతకమని బయటకు పంపేశాడు. -
కొడుక్కి వింత పరీక్ష పెట్టిన బిలియనీర్!
కొచ్చి/సూరత్: అతడో బిలియనీర్. కోట్లకు పడగెత్తిన అతడికి ఒక్కగానొక్క కొడుకు ఉన్నాడు. చేతికి అందొచ్చిన తన కొడుక్కి జీవితం అంటే ఏంటో తెలిపాలనుకున్నాడు. ఉద్యోగాలు, డబ్బు సంపాదించడానికి సామాన్యులు ఎంత కష్టపడుతున్నారో చూపించాలనుకున్నాడు. నెల రోజుల పాటు సామాన్యుడిలా కష్టపడి పనిచేసి రావాలని కొడుకు ఇంటి నుంచి పంపించేశాడు. ఇది సినిమా కథ కాదు. నిజంగా జరిగిన స్టోరి. గుజరాత్ కు చెందిన వజ్రాల వ్యాపారి సావ్జీ ఢోలకియా కుమారుడు ద్రావ్య(21) అమెరికాలో ఎంబీఏ చేస్తున్నాడు. సెలవులకు ఇంటికి వచ్చిన కొడుకును నెలరోజుల పాటు సామాన్యుడిలా జీవించమని సావ్జీ ఆదేశించాడు. జూన్ 21న మూడు జతల బట్టలు, రూ.7 వేలు ఇచ్చి వెళ్లమన్నారు. తాను ఇచ్చిన డబ్బు అత్యవసర సమయాల్లో మాత్రమే వాడాలని, ఫోన్ వినియోగించరాదని షరతులు విధించాడు. తండ్రి ఆదేశాల మేరకు కొచ్చి చేరుకున్న ద్రావ్య మొదట బేకరిలో చేరాడు. తర్వాత కాల్ సెంటర్, చెప్పుల దుకాణం, మెల్డొనాల్డ్ అవుట్లెట్ లోనూ పనిచేశాడు. నెల రోజుల్లో రూ. 4 వేలుపైగా సంపాదించాడు. తండ్రి పెట్టిన పరీక్షను విజయవంతంగా పూర్తి చేసుకుని మంగళవారం ఇంటికి తిరిగొచ్చాడు. 'మొదటి ఐదు రోజులు ఎంత తిరిగినా ఉద్యోగం దొరకలేదు. 60 చోట్లకు వెళ్లినా నిరాశ ఎదురైంది. నేనెవరో తెలియక ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించాడు. అపుడు తెలిసింది ఉద్యోగం సంపాదించడం చాలా కష్టమని. డబ్బు గురించి ఆలోచించలేదు. నేను సంపాదించిన దాంట్లో రూ.40 పెట్టి భోజనం చేసే వాడిని, లాడ్జికి రోజుకు రూ.250 చొప్పున ఇచ్చాన'ని చెప్పాడు. 'ఇంటి నుంచి పంపేటప్పుడు ద్రావ్యకు మూడు షరతులు పెట్టాను. సొంతం పనిచేసి డబ్బు సంపాదించుకోవాలి. నా పేరు ఎక్కడా వెల్లడించకూడదు. మొబైల్ ఫోన్ వాడకూడదని షరతులు విధించాను. ఇంటి నుంచి తీసుకెళ్లిన ఏడు వేల రూపాయలు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వాడాలని చెప్పాను. ఉద్యోగాలు, డబ్బు సంపాదనకు సామాన్యులు పడుతున్న కష్టాల గురించి నా కుమారుడు తెలుసుకోవాలని ఇదంతా చేశాను. జీవిత పాఠాలు ఏ యూనివర్సిటీలోనూ చెప్పరు. అనుభవాన్ని మించిన పాఠం లేద'ని సావ్జీ ఢోలకియా అన్నారు. హరేకృష్ణ డైమండ్ ఎక్స్‌పోర్ట్స్ పేరుతో సూరత్ కేంద్రంగా వజ్రాల వ్యాపారం సాగిస్తున్న ఆయన తన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు గతేడాది దీపావళికి ఖరీదైన బహుమతులు ఇచ్చి పతాక శీర్షికలకు ఎక్కారు. 491 ఫియట్ పుంటో కార్లు, 200 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు.. ఇంకా ఆభరణాలు మొదలైనవి ఉద్యోగులకు పంచారు. 71 దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న ఢోలకియా ఆస్తుల విలువ రూ.6000 కోట్లు.