కార్లు, ఫ్లాట్లు ఇచ్చాడు కానీ..
సూరత్: గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి సావ్జీ దోలాకియా.. తన కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు దీపావళి కానుకగా కార్లు, ఫ్లాట్లు, బంగారు ఆభరణాలు ఇచ్చి కార‍్పొరేట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. మీడియాలో ఆయన పేరు మార్మోగిపోయింది. సావ్జీ తాజాగా మరోసారి వార్తల్లోకెక్కాడు. అయితే ఈ సారి దానగుణంతో గాక ఉద్యోగులను మోసం చేసినట్టు అపవాదు ఎదుర్కొన్నాడు.
హరే కృష్ట ఎక్స్‌పోర్ట్స్ చైర్మన్ అయిన సావ్జీ.. తన కంపెనీలో పనిచేసే ఉద్యోగుల ఈపీఎఫ్ ఖాతాల్లో జమచేయాల్సిన 16.66 కోట్ల రూపాయలను చెల్లించలేదు. ఈపీఎఫ్‌ఓ సూరత్ బ్రాంచ్.. సావ్జీ కంపెనీకి ఈ మేరకు నోటీసులు పంపింది. 15 రోజుల్లోపు ఈ మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, కంపెనీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేస్తామని హెచ్చరించింది. సావ్జీ కంపెనీలో 3165 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కాగా పీఎఫ్ ఎగవేసేందుకు నిబంధనలకు విరుద్ధంగా తక్కువ మంది పనిచేస్తున్నట్టు చూపినట్టు ఆరోపణలు వచ్చాయి. చాలా ఏళ్లుగా ఆయన కంపెనీలో పనిచేసే ఉద్యోగుల పీఎఫ్ చెల్లించడం లేదు.