సూరత్‌లోని అత్యంత ధనవంతుడిగా ఉన్న సావ్జీ ధంజీ ధోలాకియా.. ‘ఏదీ మన చెంతకురాదు.. శోధించి.. సాధించాలి’ అని నమ్మారేమో. సులభంగా సంపద వస్తే దాన్ని నిర్వహించడం కష్టమవుతుందని భావించిన ఆయన తన కుమారుడిని స్వతంత్రంగా పనిచేయమని ప్రోత్సహించారు. దాంతో ఆయన కుమారుడు ఏకంగా బేకరీలో పనిచేసేందుకు సిద్ధపడ్డాడు. ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నాడో ఈ కథనంలో తెలుసుకుందాం.
రైతు కుటుంబంలో జన్మించిన సావ్జీ ధంజీ ధోలాకియా హరికృష్ట ఎక్స్‌పోర్ట్స్ పేరుతో కంపెనీ స్థాపించి వజ్రాలను తయారుచేస్తున్నారు. వాటిని ఎగుమతి చేస్తూ వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించారు. సావ్జీ ధోలాకియా 1962 ఏప్రిల్ 12న గుజరాత్‌లోని దుధాలా గ్రామంలో జన్మించారు. ఆయనకు ముగ్గురు సోదరులు ఉన్నారు. ఆర్థికస్థోమత లేకపోవటంతో సావ్జీ నాలుగో తరగతిలోనే చదువు మానేయాల్సి వచ్చింది. తర్వాత తన మామతో కలిసి సూరత్‌కు వచ్చి అక్కడే పనిచేశారు. మామయ్యకు చెందిన వజ్రాల వ్యాపారంలో సావ్జీ తన సోదరులు హిమ్మత్, తులసితో కలిసి పనిచేశారు. అలా 1992లో సావ్జీ తన ముగ్గురు సోదరులతో కలిసి హరి కృష్ణ ఎక్స్‌పోర్ట్స్ కంపెనీని స్థాపించారు. ఈ కంపెనీకి చెందిన డైమండ్ కటింగ్, పాలిషింగ్ యూనిట్‌ను సూరత్‌లో ఏర్పాటు చేశారు. ముంబైలో ఎగుమతి కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.
2014 నాటికి కంపెనీ ఎంతో వృద్ధి సాధించింది. అప్పటికే కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 6,500కు చేరింది. ఆ తర్వాత 2005లో 'కిస్నా' పేరుతో ఆభరణాల బ్రాండ్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం ఇది దేశవ్యాప్తంగా 6,250 అవుట్‌లెట్లతో అతిపెద్ద వజ్రాభరణాల బ్రాండ్‌గా కొనసాగుతోంది. ధోలాకియా తరచూ తమ కంపెనీ ఉద్యోగులకు దీపావళి బోనస్‌గా కార్లు, ఫ్లాట్లు, ఆభరణాలను బహుమతిగా ఇస్తుంటారు. అంతేకాదు కుటుంబం సావ్జీకు గిఫ్ట్‌గా ఇచ్చిన హెలికాప్టర్‌ను సూరత్‌లో వైద్యం ఇతర అత్యవసర పరిస్థితుల కోసం గతంలో రూ.50 కోట్ల బ్రాండ్-న్యూ ఛాపర్‌ని విరాళంగా అందించాలని నిర్ణయించడం విశేషం. అలాగే గుజరాత్‌లోని అమ్రేలి జిల్లా, లాఠీ తాలూకా తన స్వస్థలంలో ఇప్పటికే 75 చెరువులను నిర్మించడమేకాదు 20 లక్షలకుపైగా మొక్కల్ని నాటారు.
అయితే సులభంగా సంపదను పొందితే దాన్ని నిర్వహించటం వారసులకు అంత సులువు కాదు. అయితే మనుగడ కోసం మనుషులు చేసే పోరాటం గురించి తెలుసుకుంటేనే.. ప్రతి రూపాయినీ ఎలా ఖర్చు చేయాలి అనే జీవిత పాఠాలు తెలుస్తాయి. ఇదే నియమాన్ని పాటించాలని ఆ వజ్రాల వ్యాపారి తన కుమారుడికి చెప్పారు. అయితే సంపాదన కోసం లేదా పనికోసం తన పేరును ఎక్కడా వాడకూడదని సావ్జీ కండిషన్ పెట్టారు.
ఇదీ చదవండి: కొత్త నిబంధన.. ఆ ఆన్‌లైన్ లావాదేవీలకు 4 గంటలు ఆగాల్సిందే..!
దాంతో సావ్జీ ధంజీ ధోలాకియా కుమారుడు ద్రవ్యను ఇంటి పేరును ఉపయోగించకుండా స్వతంత్రంగా పనిచేయమని ప్రోత్సహించాడు. కేవలం రూ.7 వేలతో ఇంటి నుంచి బయటకు వచ్చిన ద్రవ్య.. షూ స్టోర్, మెక్‌డొనాల్డ్స్, కాల్ సెంటర్‌తో సహా అనేక ఉద్యోగాలు చేశాడు. చివరికి ఒక బేకరీలో రోజుకు రూ.200 జీతానికి ఉద్యోగం సంపాదించాడు. కొంత ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ, విలువైన జీవిత పాఠాలు నేర్చుకున్నట్లు ద్రవ్య చెప్పాడు. అలా సదరు వ్యాపారి తన పిల్లలకు అసలైన జీవిత పాఠాలను నేర్పించారు. 27 ఏళ్ల ద్రవ్య కంపెనీనీ టేకోవర్ చేశారు. 2016 లెక్కల ప్రకారం హరికృష్ణ డైమండ్ ఎక్స్‌పోర్ట్స్ కంపెనీ రూ.12000 కోట్ల మార్కెట్ క్యాపిటల్ కలిగి ఉంది. దాదాపు 71 దేశాల్లో వ్యాపారం సాగిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment