ఉద్యోగులకు 1200 కార్ల బోనస్!
Published Tue, Jan 31 2017 4:34 PM | Last Updated on Tue, Aug 21 2018 2:28 PM
ప్రతి నెలా ఉద్యోగులకు జీతాలు ఇవ్వడమే కాదు, కొన్ని సంస్థలు ప్రతియేటా తాము ఉద్యోగులకు బోనస్‌లు కూడా ఇస్తున్నట్లు చెబుతాయి. అందరి విషయం ఏమో గానీ, గుజరాత్‌కు చెందిన వజ్రాల వ్యాపారులు మాత్రం ఈ బోనస్‌ల విషయంలో అందరి కంటే ఒక మెట్టు పైనే ఉంటారు. ఇప్పటికే ఇలాంటి బోనస్‌లు చాలా ఇచ్చిన హరే కృష్ణ ఎక్స్‌పోర్టర్స్ యజమాని సావ్జీభాయ్ ఢోలకియా ఈసారి తన ఉద్యోగుల్లో 1200 మందికి కార్లు బోనస్‌గా ఇచ్చారు. 2013 నుంచి ఆయన ఈ ట్రెండ్ మొదలుపెట్టారు. ఈసారి డాట్సన్ కంపెనీ నుంచి కార్లు కొనుగోలు చేసి మరీ తన ఉద్యోగులకు ఆయన ఉచితంగా పంచిపెట్టారు.
డాట్సన్ సంస్థ ఉత్పత్తి చేసే రెడీ-గో కార్లను ఆయన కొన్నారు. ఒక రోజుకు డాట్సన్ కంపెనీ 650 కార్లు డెలివరీ ఇవ్వగలదు. అందుకే ముందుగానే ఆ కార్లకు ఆర్డర్ చేసి మరీ వాటిని తెప్పించారు. గత సంవత్సరం ఎలాంటి ప్రోత్సాహకాలు పొందని వారికి ఈసారి ఈ కార్లు ఇచ్చారు. ఈ కార్లన్నింటి మీద భారతీయ జెండాలోని మూడు రంగుల స్టిక్కర్లు కూడా ఉన్నాయి.
అయితే ఈసారి మాత్రం ఇందులో చిన్న మెలిక పెట్టారు. కార్లన్నింటికీ డౌన్ పేమెంట్ కట్టేసిన ఢోలకియా, మిగిలిన మొత్తాన్ని ఐదేళ్లకు అప్పుగా తీసుకున్నారు. దాని ఈఎంఐలను కూడా కంపెనీయే కడుతుంది. అయితే ఉద్యోగి ఈలోపు కంపెనీ నుంచి వెళ్లిపోతే మాత్రం.. అప్పటినుంచి అతడే మిగిలిన ఈఎంఐలు కట్టుకోవాల్సి ఉంటుంది. డాట్సన్ రెడీ-గో కార్ల ఢిల్లీ షోరూం ధర రూ. 2.38 లక్షలు ఉంది. చిన్నకార్ల సెగ్మెంటులో ఇది మార్కెట్లో బాగానే దూసుకెళ్తోంది.
Advertisement
Advertisement