- వాస్తవం అంగీకరించే ధైర్యం టీడీపీకి లేదు
- మీడియాతో సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం బీజేపీకి ఇష్టం లేదని, వాస్తవాన్ని అంగీకరించే ధైర్యం టీడీపీకి, చంద్రబాబుకు లేదని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర రెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం ఇక్కడ మహిళా బిల్లుపై జరిగిన ఓ సదస్సుకు హాజరైన సందర్భంలో మీడియాతో మాట్లాడారు. ‘ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వడం బీజేపీకి ఇష్టం లేదు. ఆ మాట చెప్పడానికి కేంద్రానికి ధైర్యం లేదు. వాస్తవాన్ని అంగీకరించేందుకు చంద్రబాబుకు, టీడీపీ నేతలకు ధైర్యం లేదు. ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిన కేంద్రం ప్రజలకు జ్ఞాపక శక్తి తక్కువగా ఉందని భావిస్తోంది. ప్రత్యేక హోదా అంశాన్ని ప్రజలు మరిచిపోరు. ప్రజాపోరాటం కొనసాగుతుంది. హోదా సంజీవని కాదు అని చెప్పే వారు హోదా కోసం ఇంతకాలం ఎందుకు పోరాడినట్టు? హోదా సాధించలేదు కాబట్టి, కేంద్రం నుంచి ఇంతకుమించి రాదు కాబట్టి ఇప్పుడు సంజీవని కాదంటున్నారు. హోదా ఇవ్వడం ఇష్టం లేకనే కేంద్రం 14వ ఆర్థిక సంఘం ఇవ్వొద్దని చెప్పిందంటూ అబద్దాలు ఆడుతోంది. స్వయంగా ఆ సంఘం సభ్యుడే అలా సిఫారసు చేయలేదని చెప్పారు..’ అని పేర్కొన్నారు.
పవన్ కల్యాణ్ క్షమాపణ చెప్పాలి..
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ ‘పవన్ కల్యాణ్ ఎంపీలు కారం పూసుకోవాలని, అన్ని పార్టీలు విఫలమైతే తాను రంగంలోకి వస్తానని విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. కేంద్రంలో బీజేపీని, రాష్ట్రంలో టీడీపీని గెలిపించాలని పవన్ ప్రచారం చేశారు. ఇప్పుడు ఆ రెండు పార్టీలు విఫలమయ్యాయి. వాటిని బలపరిచినందుకు పవన్ తన తప్పు ఒప్పుకొని ప్రజలకు క్షమాపణలు చెప్పి ఆందోళనలు చేపట్టాలి. ప్రస్తుత పరిస్థితులకు తనకు ఎలాంటి సంబంధం లేదనే విధంగా ఉన్న పవన్ వ్యవహార శైలి తన అభిమానులకు నచ్చుతుందో లేదో కానీ ప్రజలకు మాత్రం నచ్చదు..’ అని పేర్కొన్నారు.