Suvarnam sudhakara Reddy
-
హోదా ఇవ్వటం బీజేపీకి ఇష్టం లేదు
- వాస్తవం అంగీకరించే ధైర్యం టీడీపీకి లేదు - మీడియాతో సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర రెడ్డి సాక్షి, న్యూఢిల్లీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం బీజేపీకి ఇష్టం లేదని, వాస్తవాన్ని అంగీకరించే ధైర్యం టీడీపీకి, చంద్రబాబుకు లేదని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర రెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం ఇక్కడ మహిళా బిల్లుపై జరిగిన ఓ సదస్సుకు హాజరైన సందర్భంలో మీడియాతో మాట్లాడారు. ‘ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వడం బీజేపీకి ఇష్టం లేదు. ఆ మాట చెప్పడానికి కేంద్రానికి ధైర్యం లేదు. వాస్తవాన్ని అంగీకరించేందుకు చంద్రబాబుకు, టీడీపీ నేతలకు ధైర్యం లేదు. ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిన కేంద్రం ప్రజలకు జ్ఞాపక శక్తి తక్కువగా ఉందని భావిస్తోంది. ప్రత్యేక హోదా అంశాన్ని ప్రజలు మరిచిపోరు. ప్రజాపోరాటం కొనసాగుతుంది. హోదా సంజీవని కాదు అని చెప్పే వారు హోదా కోసం ఇంతకాలం ఎందుకు పోరాడినట్టు? హోదా సాధించలేదు కాబట్టి, కేంద్రం నుంచి ఇంతకుమించి రాదు కాబట్టి ఇప్పుడు సంజీవని కాదంటున్నారు. హోదా ఇవ్వడం ఇష్టం లేకనే కేంద్రం 14వ ఆర్థిక సంఘం ఇవ్వొద్దని చెప్పిందంటూ అబద్దాలు ఆడుతోంది. స్వయంగా ఆ సంఘం సభ్యుడే అలా సిఫారసు చేయలేదని చెప్పారు..’ అని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ క్షమాపణ చెప్పాలి.. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ ‘పవన్ కల్యాణ్ ఎంపీలు కారం పూసుకోవాలని, అన్ని పార్టీలు విఫలమైతే తాను రంగంలోకి వస్తానని విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. కేంద్రంలో బీజేపీని, రాష్ట్రంలో టీడీపీని గెలిపించాలని పవన్ ప్రచారం చేశారు. ఇప్పుడు ఆ రెండు పార్టీలు విఫలమయ్యాయి. వాటిని బలపరిచినందుకు పవన్ తన తప్పు ఒప్పుకొని ప్రజలకు క్షమాపణలు చెప్పి ఆందోళనలు చేపట్టాలి. ప్రస్తుత పరిస్థితులకు తనకు ఎలాంటి సంబంధం లేదనే విధంగా ఉన్న పవన్ వ్యవహార శైలి తన అభిమానులకు నచ్చుతుందో లేదో కానీ ప్రజలకు మాత్రం నచ్చదు..’ అని పేర్కొన్నారు. -
తెలంగాణ ఏర్పడ్డాక టీఆర్ఎస్ ఎందుకు?
టీఆర్ఎస్ నేతలకు సురవరం సూటిప్రశ్న సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా టీఆర్ఎస్ అవసరమేమిటి.. దానిని రద్దు చేయాలంటే ఏమీ సమాధానం చెబుతారని టీఆర్ఎస్ నేతలను సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి ప్రశ్నించారు. ప్రత్యేక తెలంగాణ సాధించాక టీజేఏసీ ఎందుకని టీఆర్ఎస్ నాయకులు, కొందరు మంత్రులు ప్రశ్నించడంపై ఆయన పైవిధంగా స్పందించారు. ఎవరైనా విమర్శించినపుడు వాటికి సైరెన సమాధానాలివ్వకుండా అసంబద్ధమైన విమర్శలు చేస్తే వాటి పర్యవసానాలు ఎదుర్కొనేందుకు కూడా సిద్ధంగా ఉండాలన్నారు. బుధవారం హైదరాబాద్ మఖ్దూంభవన్‌లో పార్టీ రాష్ర్ట కార్యదర్శి చాడ వెంకటరెడ్డితో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. జేఏసీ చైర్మన్ కోదండరాం ప్రభుత్వ పనితీరు, నిర్వాసితుల సమస్యలపై ప్రశ్నిస్తే ఆయనపై ఎందుకింత తీవ్రమైన దాడి చేస్తున్నారో ప్రజలకు వివరించాలన్నారు. ‘కోదండరాం లేవనెత్తిన అంశాలపై ప్రజలకు సమాధానం చెప్పాలి. మీ దగ్గర సమాధానం లేనపుడు ఆగ్రహం వస్తుంది. పాయింట్ లేనపుడు బూతులు వస్తాయి’ అని వ్యాఖ్యానించారు. ఆయా ప్రశ్నలకు వారి వద్ద సమాధానముంటే ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లింపు, కరువు నివారణకు ఏం చేశారో చెప్పాలన్నారు. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా మాట్లాడినవారు ఇప్పుడు మంత్రులుగా అద్దాల మేడలో కూర్చుని కోదండరాంపై రాళ్లు వేస్తామంటే ఎలా ప్రశ్నించారు. టీఆర్ఎస్కు ప్రజా మద్దతుంటే ఇతర పార్టీల నుంచి ఫిరాయించినవారితో రాజీనామాలు చేయించి ఎన్నికలకు ఎందుకు వెళ్లడం లేదని నిలదీశారు. రెండు తెలుగురాష్ట్రాల్లోనూ ఇదే పద్ధతిని అవలంబిస్తున్నారని, ఇంతకంటే అనైతికం ఉంటుందా అని సురవరం అన్నారు. ప్రొఫెసర్ కంచ ఐలయ్య తమ కులాన్ని విమర్శించారంటూ కొందరు బూతులు తిట్టడం, బెదిరించడం మంచి పద్ధతి కాదన్నారు. కంచ ఐలయ్యకు తమ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. అన్ని రంగాల్లో మోదీ ప్రభుత్వం విఫలం మోదీ ప్రభుత్వం అన్నిరంగాల్లో విఫల మైందని సురవరం ధ్వజమెత్తారు. సర్వీస్ టాక్స్‌ను 12 నుంచి అంచెలంచెలుగా 17 శాతానికి పెంచి ప్రజలపై ప్రత్యక్షంగా భారం వేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదేనని ఎద్దేవా చేశారు. కేంద్రం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపణలు వ చ్చాయని, వాటిపై విచారణ ఎందుకు జరిపించలేదని సురవరం ప్రశ్నించారు. -
మోదీ పాలనలో నిరుపేదలుగా పేదలు: సురవరం
హైదరాబాద్: ‘‘ఈ దేశం బీజేపీది కాదు. నరేంద్రమోదీదీ కాదు. ఈ దేశం మాది. కమ్యూనిస్టులది. మమ్మల్లి వెళ్లిపొమ్మనే హక్కు మతతత్వ శక్తులకు లేదు. స్వతంత్ర సంగ్రామంలో పాల్గొననివారు, ఆ పోరాటంతో సంబంధం లేనివారు మాపై ఆరోపణలు చేస్తారా?’’ అంటూ బీజేపీపై సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి మండిపడ్డారు. పేదల పక్షాన పోరాటం చేసే కమ్యూనిస్టులను దేశం విడిచి వెళ్లిపొమ్మనే హక్కు బీజేపీకి లేదన్నారు. అఖిల భారత కిసాన్ సభ 29వ మహాసభల్లో ఆదివారం చివరి రోజు నిజాం కళాశాల మైదానంలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. మోదీ ప్రధాని అయ్యాక పది మంది బడాబాబులకు రూ.10 లక్షల కోట్ల మేర లబ్ధి చేకూర్చి పేదలను నిరుపేదలుగా మార్చారని ఆరోపించారు. ఇటీవల పలు ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక బీజేపీ మతహింసను ప్రేరేపిస్తోందన్నారు. వ్యవసాయం మరింతగా దిగజారి 3 లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ప్రతి రైతుకూ రూ.10 వేల పింఛన్ ఇవ్వాలని ఈ సంద ర్భంగా సభ డిమాండ్ చేసింది. రైతు హక్కుల కోసం రానున్న రోజుల్లో పోరాటాన్ని తీవ్రం చేస్తామని పేర్కొంది. సభకు అఖిల భారత రైతు సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ భూపేందర్ సంబర్ అధ్యక్షత వహించారు. ప్రధాన కార్యదర్శి అతుల్ కుమార్ అంజన్, ఉపాధ్యక్షుడు రావుల వెంకయ్య, కార్యదర్శి పశ్య పద్మ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, మహాసభల ఆహ్వాన సం ఘ అధ్యక్షులు పల్లా వెంకటరెడ్డి, ఎమ్మెల్యే రవీంద్రకుమార్, జస్టిస్ చంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.