మోదీ పాలనలో నిరుపేదలుగా పేదలు: సురవరం
హైదరాబాద్: ‘‘ఈ దేశం బీజేపీది కాదు. నరేంద్రమోదీదీ కాదు. ఈ దేశం మాది. కమ్యూనిస్టులది. మమ్మల్లి వెళ్లిపొమ్మనే హక్కు మతతత్వ శక్తులకు లేదు. స్వతంత్ర సంగ్రామంలో పాల్గొననివారు, ఆ పోరాటంతో సంబంధం లేనివారు మాపై ఆరోపణలు చేస్తారా?’’ అంటూ బీజేపీపై సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి మండిపడ్డారు. పేదల పక్షాన పోరాటం చేసే కమ్యూనిస్టులను దేశం విడిచి వెళ్లిపొమ్మనే హక్కు బీజేపీకి లేదన్నారు. అఖిల భారత కిసాన్ సభ 29వ మహాసభల్లో ఆదివారం చివరి రోజు నిజాం కళాశాల మైదానంలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. మోదీ ప్రధాని అయ్యాక పది మంది బడాబాబులకు రూ.10 లక్షల కోట్ల మేర లబ్ధి చేకూర్చి పేదలను నిరుపేదలుగా మార్చారని ఆరోపించారు.
ఇటీవల పలు ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక బీజేపీ మతహింసను ప్రేరేపిస్తోందన్నారు. వ్యవసాయం మరింతగా దిగజారి 3 లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ప్రతి రైతుకూ రూ.10 వేల పింఛన్ ఇవ్వాలని ఈ సంద ర్భంగా సభ డిమాండ్ చేసింది. రైతు హక్కుల కోసం రానున్న రోజుల్లో పోరాటాన్ని తీవ్రం చేస్తామని పేర్కొంది. సభకు అఖిల భారత రైతు సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ భూపేందర్ సంబర్ అధ్యక్షత వహించారు. ప్రధాన కార్యదర్శి అతుల్ కుమార్ అంజన్, ఉపాధ్యక్షుడు రావుల వెంకయ్య, కార్యదర్శి పశ్య పద్మ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, మహాసభల ఆహ్వాన సం ఘ అధ్యక్షులు పల్లా వెంకటరెడ్డి, ఎమ్మెల్యే రవీంద్రకుమార్, జస్టిస్ చంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.