థర్డ్ ఫ్రంట్ ను చూస్తే మోడీకి వణుకు
విజయవాడ:బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై సీపీఐ పార్టీ మరోసారి మండిపడింది. ప్రధాన పత్రిపక్షం బీజేపీ వెంట ప్రాంతీయ పార్టీలు ఏవీ లేవని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ విమర్శించారు. నగరంలో వేదిక కళ్యాణ మండపంలో జరిగిన రాష్ట్ర స్థాయి సదస్సులో మాట్లాడిన నారాయణ..ప్రధానంగా మోడీని టార్గెట్ చేశారు. తృతీయ ఫ్రంట్ ను చూస్తే నరేంద్ర మోడీ వెన్నులో వణుకు పుడుతుందని ఎద్దేవా చేశారు. బీజేపీ అనేది ఒక మతతత్వపు పార్టీ అని, ఆ పార్టీని కేంద్ర పగ్గాలు చేపట్టకుండా ఉండేందుకు కృషి చేస్తామన్నారు. వామపక్ష పార్టీలు మోడీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నాయి.
వివిధ ప్రాంతీయ పార్టీలతో కూటమి ఏర్పాటు చేయడానికి సంప్రదింపులు జరుపుతున్నట్టు గతంలో సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ తెలిపిన సంగతి తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో ప్రజలకు కొత్త ప్రత్యామ్నాయం అందించే లక్ష్యంతో వామపక్షాలు కృషిచేస్తున్నాయని ఆయన తెలిపారు. దీని కోసం ప్రాంతీయ పార్టీలయిన మాజ్‌వాదీ పార్టీ, జేడీయూ, ఏఐఏడీఎంకే, జేడీఎస్, బీజేడీ వంటి పార్టీలతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు.