తెలంగాణ ఏర్పడ్డాక టీఆర్ఎస్ ఎందుకు?
టీఆర్‌ఎస్ నేతలకు సురవరం సూటిప్రశ్న
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా టీఆర్‌ఎస్ అవసరమేమిటి.. దానిని రద్దు చేయాలంటే ఏమీ సమాధానం చెబుతారని టీఆర్‌ఎస్ నేతలను సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి ప్రశ్నించారు. ప్రత్యేక తెలంగాణ సాధించాక టీజేఏసీ ఎందుకని టీఆర్‌ఎస్ నాయకులు, కొందరు మంత్రులు ప్రశ్నించడంపై ఆయన పైవిధంగా స్పందించారు. ఎవరైనా విమర్శించినపుడు వాటికి సైరెన సమాధానాలివ్వకుండా అసంబద్ధమైన విమర్శలు చేస్తే వాటి పర్యవసానాలు ఎదుర్కొనేందుకు కూడా సిద్ధంగా ఉండాలన్నారు. బుధవారం హైదరాబాద్ మఖ్దూంభవన్‌లో పార్టీ రాష్ర్ట కార్యదర్శి చాడ వెంకటరెడ్డితో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. జేఏసీ చైర్మన్ కోదండరాం ప్రభుత్వ పనితీరు, నిర్వాసితుల సమస్యలపై ప్రశ్నిస్తే ఆయనపై ఎందుకింత తీవ్రమైన దాడి చేస్తున్నారో ప్రజలకు వివరించాలన్నారు. ‘కోదండరాం లేవనెత్తిన అంశాలపై ప్రజలకు సమాధానం చెప్పాలి. మీ దగ్గర సమాధానం లేనపుడు ఆగ్రహం వస్తుంది.
పాయింట్ లేనపుడు బూతులు వస్తాయి’ అని వ్యాఖ్యానించారు. ఆయా ప్రశ్నలకు వారి వద్ద సమాధానముంటే ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లింపు, కరువు నివారణకు ఏం చేశారో చెప్పాలన్నారు. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా మాట్లాడినవారు ఇప్పుడు మంత్రులుగా అద్దాల మేడలో కూర్చుని కోదండరాంపై రాళ్లు వేస్తామంటే ఎలా ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌కు ప్రజా మద్దతుంటే ఇతర పార్టీల నుంచి ఫిరాయించినవారితో రాజీనామాలు చేయించి ఎన్నికలకు ఎందుకు వెళ్లడం లేదని నిలదీశారు. రెండు తెలుగురాష్ట్రాల్లోనూ ఇదే పద్ధతిని అవలంబిస్తున్నారని, ఇంతకంటే అనైతికం ఉంటుందా అని సురవరం అన్నారు. ప్రొఫెసర్ కంచ ఐలయ్య తమ కులాన్ని విమర్శించారంటూ కొందరు బూతులు తిట్టడం, బెదిరించడం మంచి పద్ధతి కాదన్నారు. కంచ ఐలయ్యకు తమ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు.
అన్ని రంగాల్లో మోదీ ప్రభుత్వం విఫలం
మోదీ ప్రభుత్వం అన్నిరంగాల్లో విఫల మైందని సురవరం ధ్వజమెత్తారు. సర్వీస్ టాక్స్‌ను 12 నుంచి అంచెలంచెలుగా 17 శాతానికి పెంచి ప్రజలపై ప్రత్యక్షంగా భారం వేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదేనని ఎద్దేవా చేశారు. కేంద్రం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపణలు వ చ్చాయని, వాటిపై విచారణ ఎందుకు జరిపించలేదని సురవరం ప్రశ్నించారు.