
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలా.. వద్దా.. అన్న దానిపై తర్జనభర్జన పడిన తెలంగాణ జన సమితి (టీజేఎస్) ఎట్టకేలకు మూడు స్థానాల్లో పోటీకి దిగింది. సోమవారం మహబూబాబాద్, హైదరాబాద్, ఖమ్మం స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. పార్టీ అధ్యక్షుడు కోదండరాం అభ్యర్థులకు ఉదయమే బీ–ఫాంలు అందజేశారు. హైదరాబాద్ నుంచి కవి అబ్బాసీ, మహబూబాబాద్ నుంచి అరుణ్‌కుమార్, ఖమ్మం నుంచి గోపగాని శంకర్‌రావు టీజేఎస్ తరపున నామినేషన్లు దాఖలు చేసినట్లు కోదండరాం వెల్లడించారు. పార్టీ కార్యాలయంలో మేనిఫెస్టోను విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. తాము పోటీ చేయని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.
రాజకీయం డబ్బుమయం..
ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయాలు దిగజారి పోతున్నాయని కోదండరాం అన్నారు. నాయకులు ఒకే పార్టీలో చివరివరకు ఉండటం లేదని, 1969 నాటి పరిస్థితులు ఇప్పుడు కనపడుతున్నాయన్నారు. రాజకీయం డబ్బుమయం అయిందని చెప్పారు. 14 ఎంపీ సీట్లున్నా టీఆర్‌ఎస్ చేసిందేమీ లేదని, బీజేపీ కూడా విభజన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు. టీజేఎస్ బలోపేతంపై తాము దృష్టి పెడుతున్నామని తెలిపారు. టీఆర్‌ఎస్ పాలనలో గిరిజనులు, మైనారిటీలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే..
నిజామాబాద్ రైతులను నామినేషన్ వేయకుండా అడ్డుకోవడం సరికాదని, అది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని కోదండరాం అన్నారు. నామినేషన్ వేసిన రైతులపై కేస్‌లు పెడుతున్నారని, ఆ రైతుల వెంట తాము ఉంటామని భరోసానిచ్చారు. తెలంగాణ ప్రజలు, ఆంధ్రా ప్రజలు అంటూ కొంతమంది ప్రజల మధ్య వైషమ్యాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారని, అలాంటివి మానుకోవాలని హితవు పలికారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై ప్రజలు తిరుగుబాటు చేస్తేనే పరిస్థితులు మారుతాయని కోదండరాం పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment