సర్వేలో వెల్లడైన దేశ ప్రజల మనోగతం
న్యూఢిల్లీ: భారత్ సరైన దిశలోనే వెళ్తోందని దేశ ప్రజల్లో అత్యధికం విశ్వసిస్తున్నారు. చైనా, సౌదీ అరేబియా దేశాలు కూడా సరైన గమ్యం దిశగానే వెళ్తున్నాయని అక్కడి ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ‘ప్రపంచాన్ని భయపెడుతున్నదేమిటి?’ అన్న ప్రశ్నతో మార్కెట్ పరిశోధన సంస్థ ఇప్సోస్ 26 దేశాల్లో నిర్వహించిన ఆన్‌లైన్ సర్వేలో ఈ విషయం వెల్లడయింది. ప్రపంచ ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్న సమస్యల్లో నిరుద్యోగం, ఆర్థిక/రాజకీయ అవినీతి, పేదరికం/సామాజిక అసమానతలు ముఖ్యమైనవిగా ఈ సర్వేలో తేలింది.
అవినీతి, నిరుద్యోగం, నేరాలు భారతీయులను తీవ్రంగా కలచివేస్తున్నాయి. నైతిక విలువల పతనం, పర్యావరణం, నిరుద్యోగంపై చైనీయులు.. నిరుద్యోగం, ఉగ్రవాదం, పన్నుల గురించి సౌదీ అరేబియా ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ సర్వే ఫలితాల ప్రకారం.. తమ దేశాలు గాడిలోనే నడుస్తున్నాయని చైనా, భారత్, సౌదీ ప్రజలు అత్యంత సానుకూల అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భారత్‌లో ఇలా విశ్వసించేవారు 74 శాతం మంది, చైనాలో 87 శాతం మంది, సౌదీలో 71 శాతం మంది ఉన్నారు. అయితే అమెరికా, బ్రిటన్, స్వీడన్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, ఆస్ట్రేలియా పౌరులు తమ దేశాలు గాడి తప్పాయని అభిప్రాయపడ్డారు.