టీనేజ్ బాలికల (13–19 వయస్కులు) ఆశలు, ఆకాంక్షలు, ఆరోగ్యం, నైపుణ్యాలు వంటి అంశాలపై ‘నన్హి కలి’ ప్రాజెక్టులో భాగంగా దేశవ్యాప్త సర్వే జరిపింది నాందీ ఫౌండేషన్. సంబంధిత సమాచారంతో గత నెలాఖరున వెలువరించిన నివేదిక ప్రకారం.. కౌమార బాలికల స్థితిగతుల పరంగా కేరళ ముందుంది. మిజోరం, సిక్కిం, మణిపూర్, హిమాచల్‌ప్రదేశ్‌లు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. నగరాల పరంగా చూసినప్పుడు.. ముంబై, కోల్‌కతా, బెంగళూరు మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.
మొబైల్ ఫోన్ల వినియోగం తెలిసి ఉండటం, అవసరమైన ఫారాలు పూర్తి చేసుకోగలగడం, సాయం కోసం అవసరమైతే ఓ పురుషుడి సాయం కోరడం, ఒంటరిగా ప్రయాణించగలగడం, పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు ఇవ్వగలగడం, బ్యాంకులు, ఏటీఎంల నుంచి నగదు డ్రా చేయగలగడం, వారం పాటు ఇంట్లో ఒంటరిగా ఉండగలగడం, ఇంటర్‌నెట్, వాట్సాప్, ఫేస్‌బుక్ ఉపయోగించుకోగల సమర్థత, కంప్యూటర్‌పై ఇంగ్లిష్‌లో ఓ డాక్యుమెంట్‌ను తయారు చేయగలగడం.. ఇవన్నీ ఈ తరానికి అవసరమైన నైపుణ్యాలుగా పేర్కొన్నారు సర్వే నిర్వాహకులు. వీటిని ‘న్యూ ఏజ్ స్కిల్స్’అని పేర్కొంటున్నారు.
టీనేజ్ బాలికల సూచీలో మొదటి స్థానంలో ఉన్న కేరళలో 70.4 శాతం మందికి ఇలాంటి నైపుణ్యాలున్నాయి. మిజోరం (67.6 శాతం), హిమాచల్ ప్రదేశ్ (66.3 శాతం), సిక్కిం (65 శాతం)లలో కూడా ఇలాంటి టీనేజర్లు బాగానే ఉన్నారు. తెలంగాణ (22.5శాతం) ఆంధ్రప్రదేశ్ (29 శాతం)లో ఇలాంటి బాలికలు తక్కువే. నగరాలపరంగా చూస్తే.. ‘స్కిల్’ విషయంలో ముంబై టీనేజర్లు (76.8 శాతం) ముందున్నారు. బెంగళూరు (66.1 శాతం), కోల్‌కతా (53.2శాతం) టీనేజర్లు తర్వాతి స్థానాల్లో ఉన్నారు. దేశ సగటు 52.3 శాతం. దేశంలోని ప్రతి ఇద్దరు కౌమార బాలికల్లో ఒకరు చదువు, ఉద్యోగాల్లో అబ్బాయిలకు మెరుగైన అవకాశాలున్నాయని భావిస్తున్నారు. అబ్బాయిలు తమలా ఇంటి పనులు చేయగలరని భావిస్తున్న బాలికలు ప్రతి ఐదుగురిలో ఒక్కరు మాత్రమే.
Comments
Please login to add a commentAdd a comment