శానిటరీ ప్యాడ్ బ్యాంక్ ఏర్పాటు చేసిన బీహార్‌లోని నవడా జిల్లా టీనేజ్ అమ్మాయిల బృందం
డబ్బు లేకపోవడం వల్ల అమ్మాయిల కనీస అవసరాలు ఎలా తీరవో అక్కడ చేరిన అందరికీ అర్ధమైంది. ‘ఏం చేద్దాం’ అని జట్టుగా ఆలోచించినప్పుడు వారికో అద్భుతమైన ఆలోచన వచ్చింది. వారి ఆలోచనా రూపం ‘ప్యాడ్ బ్యాంక్.’
బీహార్‌లోని నవాడా జిల్లాకు చెందిన టీనేజ్ అమ్మాయిల బృందం ఈ శానిటరీ ప్యాడ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేసింది. ఇందుకోసం ఆ ఊళ్లోని ప్రతి అమ్మాయి నుంచి రోజూ ఒక రూపాయి వసూలు చేస్తారు. ఈ డబ్బుతో ప్యాడ్లు కొని నిరుపేదలైన అమ్మాయిలకు ఉచితంగా ఇస్తారు.
ఆలోచనకు ప్రేరణ
రుతుస్రావం సమయంలో శుభ్రమైన శానిటరీ ప్యాడ్లను వాడకపోవడం వల్ల కలిగే అనర్థాలు ఇంకా పల్లెలకు చేరలేదు. యువతులు, మహిళల ఆరోగ్యరీత్యా ఇప్పటికే శుభ్రమైన ప్యాడ్స్ వినియోగంపై ఎన్నో సామాజిక అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఉచితంగా కొందరికి శానిటరీ ప్యాడ్లను పంచుతున్నారు. కానీ, అవి అందరికీ చేరడం లేదు. అందుకే నవాడా జిల్లా గ్రామీణ యువతులు తమ సమస్యకు ఓ పరిష్కారం కనుకున్నారు. ఆర్థికంగా వెనకబాటులో ఉన్న తమ ప్రాంత అమ్మాయిలకు శుభ్రమైన శానిటరీ ప్యాడ్లను ఉచితంగా అందివ్వడానికి ముందుకు వచ్చారు.
‘మెయిన్ కుచ్ కియా కరే’ అనే ఎడ్యుటైన్మెంట్ షో నుండి ఈ టీనేజ్ అమ్మాయిల ప్రేరణ పొందారు. కుటుంబ నియంత్రణ, బాల్య వివాహం, అవాంఛిత గర్భం, గృహ హింస, లైంగిక ఆరోగ్యం వంటి సమస్యల గురించి ప్రజలకు అవగాహన కలిగించే ప్రదర్శన అది. ‘పాప్యులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ట్రాన్స్ మీడియా’ చొరవతో నవాడా జిల్లా అమ్మాయిలు ప్రేరణ పొందారు. శానిటరీ ప్యాడ్స్ బ్యాంక్ ఎందుకు, ఎలా ఏర్పాటు చేయడమైందో అక్కడి ఓ టీనేజర్ అను కుమారి వివరిస్తూ– ‘పాతిక మంది అమ్మాయిలం కలిసి ఒక జట్టుగా ఏర్పడ్డాం. ఆర్థికంగా బాగున్న అమ్మాయిలు ముందుకు వచ్చి ఒక్కో అమ్మాయి రోజూ ఒక రూపాయి జమ అయ్యేలా చేస్తాం. అంటే ప్రతి అమ్మాయి నెలకు 30 రూపాయలు ఇస్తుంది. ఆ డబ్బుతో మేము ప్యాడ్లు కొని పేద అమ్మాయిలకు పంపిణీ చేస్తాం. అందుకు ఒక రిజిస్టర్‌ను ఉపయోగించి, అందులో వివరాలన్నీ పొందుపరుస్తున్నాం’ అని తెలిపింది.
అవగాహన సదస్సుల అవసరం
నవాడా మాజీ సివిల్ సర్జన్ డాక్టర్ శ్రీనాథ్ ప్రసాద్ మాట్లాడుతూ, ‘బాలికలు మొదట తమ గురించి ఇలాంటి విషయాలేవీ మాట్లాడలేకపోయారు. వారి శరీరంలో జరుగుతున్న శారీరక మార్పుల గురించి వారికేమీ తెలియదు. వారికి శానిటరీ ప్యాడ్ల వాడకం గురించి నిన్నటి వరకు తెలియదు. కాని ఈ రోజు.. వారంతా కలిసి శానిటరీ ప్యాడ్ బ్యాంకును ప్రారంభించారు. ఈ ప్రదర్శన బాలికలను ఎంతవరకు ప్రభావితం చేసిందో ఆలోచించవచ్చు. ఇప్పుడు వీరందరిలో ‘నేను ఏదైనా సాధించగలను’ అని నమ్మకం పెరిగింది. ఇలాంటి అవగాహన సదస్సులు, కార్యక్రమాలు మరెన్నో పల్లెల్లో జరగాలి’ అన్నారు.
గోప్యత ఇక అనవసరం
సంఘం సభ్యురాలు సంగీతాదేవి మాట్లాడుతూ ‘గతంలో మేం రుతుస్రావం సమయంలో అసౌకర్యాన్ని తట్టుకునేవాళ్ళం. అంతా గోప్యంగా ఉండాలనుకునేవాళ్లం. అనారోగ్యం బారినపడేవాళ్లం. కాని మా కుమార్తెలు న్యాప్‌కిన్ల గురించి మాకు చెప్పారు. శుభ్రత గురించి, దానివల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. వాళ్లలో వచ్చిన మార్పుకు చాలా సంతోషంగా ఉంద’ని వివరించింది.
పాప్యులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పూనమ్ ముత్రేజా మాట్లాడుతూ – ‘నేను ఏం చేయగలను?’ అనేది మిలియన్ల మంది యువతులు ప్రశ్న. ‘నేను అన్నీ చేయగలను’ అని ఇక్కడి యువతులు నిరూపిస్తున్నారు. ఈ ప్రదర్శన అందరి జీవితాలను ప్రభావితం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది అని ఆమె చెప్పారు. ఈ షోలో పాల్గొన్న డాక్టర్ స్నేహ మాథుర్ తన ఉత్తేజకరమైన పాత్ర ద్వారా లైంగిక వివక్ష, పరిశుభ్రత, కుటుంబ నియంత్రణ, బాల్య వివాహం, మానసిక ఆరోగ్యం, మాదకద్రవ్యాల దుర్వినియోగం, పోషణ, కౌమార ఆరోగ్యం వంటి క్లిష్టమైన విషయాల గురించి చర్చించారు. యువతులు ఆసక్తిగా తమ సందేహాలన్నీ అడిగి మరీ తెలుసుకున్నారు అమ్మాయిలకు వారి శారీరక ఆరోగ్యం గురించి అవగాహన కలిగిస్తే చాలు వారు మరికొందరిని జాగృతం చేస్తారు. అందుకు శానిటరీ ప్యాడ్ బ్యాంక్ పెద్ద ఉదాహరణ.
Comments
Please login to add a commentAdd a comment