సహకారంతో మున్ముందుకు..!
వియత్నాం ప్రధాని, విదేశాంగ మంత్రితో సుష్మా స్వరాజ్ భేటీ
హనోయ్: పరస్పర సహకారాన్ని, ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత విసృ్తతం చేసుకోవాలని, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2020 నాటికి 15 బిలియన్ డాలర్లకు పెంచుకోవాలని భారత్, వియత్నాంలు నిర్ణయించాయి. భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ వియత్నాం పర్యటన సందర్భంగా ఇరుదేశాల మధ్య రక్షణ, భద్రత, చమురు రంగాల్లో సహకారానికి సంబంధించి చర్చలు జరిగాయి.
సుష్మా సోమవారం ఇక్కడ వియత్నాం ప్రధానమంత్రి గుయెన్ టాన్ దంగ్, విదేశాంగ మంత్రి ఫామ్ బిన్ మిన్‌లతో సమావేశమయ్యారు. వారితో దైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై చర్చించారు. తూర్పు దేశాలతో కేవలం ‘లుక్ ఈస్ట్’ విధానం సరిపోదని మెరుగైన కార్యాచరణతో ‘యాక్ట్‌ఈస్ట్’ విధానాన్ని అమలు చేయాలనుకుంటున్నామని సుష్మా అన్నారు.