
మసూద్ అంశాన్ని సమీక్షించండి
చైనాకు స్పష్టం చేసిన సుష్మా స్వరాజ్
మాస్కో: ఐక్యరాజ్యసమితిలో జైషే మహ్మద్ అధినేత మసూద్ అజర్‌పై నిషేధాన్ని చైనా అడ్డుకోవడంపై ఆ దేశానికి భారత్ తీవ్ర అసంతృప్తి తెలిపింది. మాస్కోలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌యీతో సమావేశమైన భారత్ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఐరాసలో ఆ దేశ చర్యను పునఃసమీక్షించుకోవాలని సూచించారు. రష్యా, భారత్, చైనా(ఆర్‌ఐసీ) విదేశాంగ మంత్రుల సమావేశం సోమవారం మాస్కోలో జరిగింది. అనంతరం విలేకర్లతో సుష్మా మాట్లాడుతూ.. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాట లక్ష్యాల్ని సాధించాలంటే చైనా నిర్ణయాన్ని మార్చుకోవాలని వాంగ్‌కు స్పష్టం చేశానన్నారు.
ఉగ్రవాద సమస్యపై ఉమ్మడిపోరాటానికి సంయుక్త సహకారం అవసరమని చైనాకు సూచించానని చెప్పారు. ఉమ్మడిగా ఉగ్రవాదంపై పోరాటం కొనసాగాలంటే నిర్ణయాన్ని మార్చుకోవాలని వాంగ్‌కు ఆమె వెల్లడించారు. ఈ అంశంపై ఇరుపక్షాలు చర్చలు కొనసాగించాలని నిర్ణయించాయంటూ విదేశాంగ ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. అజర్‌ను ఉగ్రవాదిగా ప్రకటించాలన్న భారత్ అభ్యర్థనను గత నెలలో ఐరాస అనుమతుల కమిటీ ముందు చైనా అడ్డుకుంది. దీనిపై భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. జైషే మహ్మద్‌ను నిషేధించిన ఐరాస దాని అధినేతను నిషేధించకపోవడం సరికాదంది.
అంతకుముందు ఆర్‌ఐసీ సదస్సులో సుష్మ మాట్లాడుతూ... ఉగ్రవాదం నిర్మూలనలో ద్వంద్వ విధానాలు అనుసరిస్తే అంతర్జాతీయ సమాజం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిన ప్రమాదం ఉందన్నారు. భద్రతా మండలి సంస్కరణలపై తక్షణం చర్యలు తీసుకోవాలని, చైనా, రష్యా సహకారం అందించాలని కోరారు. రష్యాలో స్మోలెన్స్‌క్ స్టేట్ మెడికల్ అకాడమీ అగ్ని ప్రమాదంలో ఇద్దరు భారత వైద్య విద్యార్థుల మృతి, ఖాజన్‌లో కశ్మీర్ వ్యాపారవేత్త హత్య అంశాలను రష్యా విదేశాంగ మంత్రి సెర్గి లావ్రోవ్‌తో భేటీ సందర్భంగా సుష్మా లేవనెత్తారు. భారత్‌లో యాసిడ్ దాడికి గురైన రష్యా యువతి చికిత్సకయ్యే మొత్తం ఖర్చును భరిస్తామన్నారు.