న్యూఢిల్లీ : ఆఫ్రికన్ విద్యార్థులపై వరుస దాడుల నేపథ్యంలో కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ మంగళవారం వారితో భేటీ అయ్యారు. వారికి పూర్తిస్థాయిలో భద్రత కల్పిస్తామని ఆమె ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. కాంగో విద్యార్థిపై దాడిని సుష్మ స్వరాజ్ తీవ్రంగా ఖండించారు. ఈ నెల 20న ఢిల్లీలో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశానికి చెందిన ఓ విద్యార్థి మృతి చెందిన విషయం తెలిసిందే. ఒలివర్(23) అనే కాంగో విద్యార్థితో నలుగురు వ్యక్తులు గొడవపడి అతడిని రాళ్లు, కర్రలతో తీవ్రంగా కొట్టారు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందాడు.
కాగా ఈ దాడి జాతిపరమైనది కాదని, అయితే ఈ సంఘటన బాధాకరమని సుష్మ తెలిపారు. బిడ్డను కోల్పోతే ఓ తల్లిగా ఆ బాధ తనకు తెలుసునని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన విద్యార్థి కుటుంబీకులకు అన్ని రకాలుగా సహకరిస్తామని సుష్మ తెలిపారు. దాడికి సంబంధించి నివేదిక ఇవ్వాలని ఇప్పటికే లెఫ్ట్నెట్ గవర్నర్ను ఆదేశించినట్లు చెప్పారు. సీసీ టీవీ పుటేజ్ లో దాడికి పాల్పడినవారు ఎవరైనది స్పష్టంగా ఉందని, ఈ దాడిలో పాల్గొన్న మరో ఇద్దరిని అరెస్ట్ చేయాలని ఆదేశించినట్లు సుష్మా స్వరాజు పేర్కొన్నారు.
అలాగే బుధవారం హైదరాబాద్లో పార్కింగ్ వివాదంలో నైజీరియన్ విద్యార్థులపై దాడికి సంబంధించిన కూడా సుష్మా స్వరాజ్ తక్షణమే నివేదికను కోరారు. ఈ విషయమై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో ఫోన్లో మాట్లాడినట్లు ఆమె వెల్లడించారు. ఆఫ్రికన్లపై దాడి చేసిన నిందితులను శిక్షించాలని ఆమె కోరారు.
తల్లిగా ఆ బాధేంటో నాకు తెలుసు: సుష్మా స్వరాజ్
Published Tue, May 31 2016 4:08 PM | Last Updated on Thu, Mar 28 2019 6:23 PM
Advertisement