దాడికి గురైన ఆఫ్రికన్ విద్యార్థులకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూస్తామని భారత విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ హామీ ఇచ్చారు.
గ్రేటర్ నోయిడా: దాడికి గురైన ఆఫ్రికన్ విద్యార్థులకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూస్తామని భారత విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ హామీ ఇచ్చారు. ఈ మేరకు తనకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ తగిన భరోసా ఇచ్చారని, విద్యార్థులపై దాడి ఘటన విషయంలో నిష్పక్షపాతమైన, సానుకూలమైన, న్యాయబద్ధమైన విచారణ జరిపిస్తామని చెప్పారని అన్నారు. మనీశ్ కారి అనే పన్నెండో తరగతి చదువుతున్న విద్యార్థి చనిపోయిన నేపథ్యంలో గ్రేటర్ నోయిడాలో ఆందోళన జరిగింది.
అది కాస్త భీభత్సంగా మారి అక్కడ ఉంటున్న నైజీరియాకు చెందిన విద్యార్థులపై ఓ గుంపు దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. దీంతో బెంబేలెత్తిపోయిన నైజీరియా విద్యార్థులు సుష్మాస్వరాజ్‌కు ట్వీట్ చేశారు. నోయిడాలో తమ ప్రాణాలకు ముప్పు ఉందని సత్వరమే స్పందించి రక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో యోగికి సుష్మా ఈ విషయాన్ని చెప్పారు. డ్రగ్స్ బారిన పడే మనీశ్ చనిపోయాడని, అందుకు నైజీరియన్లే కారణం అని వారిపై దాడి చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు నైజీరియన్లు ఆస్పత్రి పాలయ్యారు.