లక్నోలో హజ్రత్ గంజ్ పోలీస్ స్టేషన్ లో గురువారం సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆకస్మిక తనిఖీ
నోయిడా: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పై ఫేస్ బుక్ లో అభ్యంతర సమాచారం పోస్టు చేసిన 22 ఏళ్ల యువకుడిని గ్రేటర్ నోయిడా పోలీసులు అరెస్ట్ చేశారు. హిందూ యువ వాహిని సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడు రహత్ ఖాన్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
దంకౌర్ ప్రాంతంలో జన సువిధ కేంద్రం(ప్రజా వినియోగ కేంద్రం) నడుపుతున్న రహత్ మార్ఫింగ్ చేసిన సీఎం యోగి ఫొటోలను తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశాడు. అతడిపై ఐటీ చట్టంలోని 66ఏ చట్టం కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
తన కుమారుడు అమాయకుడని, అతడిని కుట్రపూరితంగా ఇరికించారని రహత్ ఖాన్ తల్లి మున్నీ అన్నారు. ఇదంతా ల్యాండ్ మాఫియా కుట్ర అని ఆరోపించారు. తన కుమారుడి ఫేస్ బుక్ పాస్ వర్డ్ దొగిలించి, సీఎం యోగిపై అభ్యంతకర సమాచారం పోస్టు చేశారని తెలిపారు. హిందూ యువ వాహిని సంస్థను సీఎం యోగి స్థాపించడం గమనార్హం.
కాగా, సీఎం యోగిపై అభ్యంతర ఫొటోలు పోస్టు చేశారనే ఆరోపణలతో కర్ణాటకలో ప్రభ ఎన్ బైలహొంగల అనే మహిళపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.