రాడ్లు, ఇటుకలతో దాడి: ఎందుకు కొట్టారో తెలియదు!!
న్యూఢిల్లీ: 'మమ్మల్ని ఎందుకు కొడుతున్నారో కూడా మాకు తెలియదు. అల్లరి మూక మమ్మల్ని చుట్టుముట్టి.. ఇనుపరాడ్లు, ఇటుకలు, కత్తులతో దాడి చేసింది. మమ్మల్ని కాపాడండి, సాయం చేయండి అని చుట్టూ ఉన్నవారిని దీనంగా అర్థించాం. కానీ ఎవరూ పోలీసులకు ఫోన్ కూడా చేయలేదు. కనీసం మా కాలేజీ వాళ్లు మాకు సాయం చేయలేదు'.. గ్రేటర్ నోయిడాలో మూక దాడిలో తీవ్రంగా గాయపడ్డ నైజీరియన్ జాతీయుడి ఆవేదన ఇది.
సోమవారం ఢిల్లీకి సమీపంలోని గ్రేటర్ నోయిడాలో ఉన్న ఓ షాపింగ్ మాల్‌లో ఆఫ్రికన్లపై తీవ్ర అమానుషంగా ఓ మూక విరుచుకుపడిన సంగతి తెలిసిందే. జాతివివక్షను తలపించేలా సాగిన ఈ ఘటన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ ఘటనలో గాయపడిన నైజీరియా జాతీయుడు తాజాగా మీడియాతో మాట్లాడారు. 'ఒక్కరంటే ఒక్కరు కూడా మాకు సాయంగా ముందుకురాలేదు. గతంలోనూ మా చుట్టుపక్కల ఉండేవారు మీరు మా దేశంలో ఉండొద్దు అంటూ మాట్లాడేవారు. ఇలాంటివారిని చూసి నేను ఏం మాట్లాడాలి' అని పేర్కొన్నారు.
గ్రేటర్ నోయిడాలో మనీశ్ కారి అనే పన్నెండో తరగతి చదువుతున్న విద్యార్థి డ్రగ్స్ అధికంగా తీసుకోవడంతో స్థానికులు ఆగ్రహం చెందారు. ఈ ఘటనలో ఆ విద్యార్థి ఉండే అపార్ట్‌మెంట్ సమీపంలో ఉన్న ఐదుగురు నైజీరియన్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో నైజీరియన్‌పై షాపింగ్ మాల్ లో దాడి జరిగినట్టు పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటనపై స్పందించాల్సిందిగా యూపీ సీఎం యోగికి ఫోన్ చేసినట్టు విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు.